RGV: ‘పుష్ప-2’.. ప్లేట్ ఇడ్లీ.. డైరెక్టర్ ఆర్జీవీ ఆసక్తికర ట్వీట్!
అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-2’ మూవీ టిక్కెట్స్ రేట్స్‌ని భారీగా పెంచుకునేందుకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. భారీగా పెరిగిన టికెట్ ధరలపై కొన్ని వర్గాలు సామాజిక మాధ్యమాల వేదికగా అసహనం వ్యక్తంచేశాయి. ధరలను నియంత్రించాలని కోరుతూ పలువురు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ‘ఎక్స్’ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘పుష్ప-2’ టికెట్‌లను స్టార్ హోటల్ ఇడ్లీతో పోల్చారు.
సినిమాలు ప్రజాసేవ కోసం కాదు!
‘సుబ్బారావు ఇడ్లీ ధర సామాన్యులకు అందుబాటులో లేదు’ అని ఎవరైనా ఏడిస్తే, అది ‘సెవెన్‌స్టార్ హోటల్ సామాన్యులకు అందుబాటులో లేదు’ అని ఏడ్చినంత వెర్రితనం. ఒకవేళ ‘సెవెన్‌స్టార్ హోటల్‌లో యాంబియన్స్‌కి మనం ధర చెల్లిస్తున్నాం’ అని వాదిస్తే, పుష్ప-2 విషయంలో ఆ క్వాలిటీ అనేదే సినిమా. డెమోక్రటిక్ క్యాపిటలిజం అనేది క్లాస్ డిఫరెన్స్ మీదే పనిచేస్తుంది. అన్ని ప్రొడక్ట్స్‌లాగే సినిమాలు కూడా లాభాల కోసమే నిర్మిస్తారు. అంతేకానీ, ప్రజా సేవ కోసం కాదు. లగ్జరీ కార్లు, విలాసవంతమైన భవనాలు, ఖరీదైన బ్రాండెడ్ దుస్తుల ధరలపై ఎలాంటి ఏడుపూ ఏడవనోళ్లు సినిమా టికెట్ ధరల మీదే ఎందుకు ఏడుస్తున్నారు? అయినా ఎంటర్టైన్మెంట్ ఏమైనా అత్యవసరమా? రేట్లు తగ్గాక చూసుకోవచ్చు కదా?’ అని పోస్ట్ పెట్టారు.