Sai Pallavi: ఆ సినిమా షూట్‌లో ఏడ్చేసిన సాయి పల్లవి.. అసలు ఏం జరిగిందంటే..?
నేచురల్ స్టార్ నాని, బాక్సాఫీస్ క్వీన్ సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో 2021, డిసెంబర్‌లో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ మూవీలో శ్యామ్ సింగరాయ్ పాత్రలో నాని, దేవదాసి పాత్రలో సాయిపల్లవి అద్భుతంగా నటించి, విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నారు. అయితే ఈ మూవీ షూటింగ్ సమయంలో తాను ఎంతో ఏడ్చానని సాయి పల్లవి గుర్తుచేసుకున్నారు.
తెల్లారే వరకు మేల్కొనే..!
ఇటీవల ‘అమరన్’ మూవీ సక్సెస్‌పై ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయి పల్లవి మాట్లాడుతూ శ్యామ్ సింగరాయ్ షూటింగ్ రోజులను గుర్తుచేసుకున్నారు. ‘శ్యామ్ సింగరాయ్ చేస్తున్నపుడు ఆ రోజు షూట్ పూర్తయితే ఎంతో ఆనందంగా ఉండేది. నా సన్నివేశాలన్నీ చాలా వరకూ రాత్రి పూటనే చిత్రీకరించారు. రాత్రి షూటింగ్‌లు నాకు అలవాటు లేదు. పగలు నాకు నిద్రరాదు కాబట్టి రాత్రిళ్లు నా పరిస్థితి దారుణంగా ఉండేది. ఒక్కోసారి తెల్లారేవరకు మేల్కొని ఉండాల్సి వచ్చేది. దాదాపు 30 రోజులు ఇలానే గడిచాయి. ‘ఒకరోజు రాత్రి నన్ను చూడటానికి నా చెల్లి వచ్చింది. తనతో మాట్లాడుతూ ఒక్కసారిగా ఏడ్చేశా. ఒప్పుకొన్న సినిమాలు చేయాలనుంది కానీ.. ఓ రోజు విశ్రాంతి దొరికితే బాగుండు అంటూ నా బాధను షేర్ చేసుకున్నా. నా చెల్లె నేరుగా నిర్మాత వెంకట్ బోయనపల్లి దగ్గరకు వెళ్లి.. మా అక్క ఏడుస్తోంది. ఒక రోజైనా సెలవు ఇవ్వండి అని అడిగింది. ఆయన వెంటనే నా వద్దకు వచ్చి.. ఒకటి కాదు పది రోజులు తీసుకో, అంతా బాగానే ఉందనుకున్నప్పుడు షూటింగ్‌కు రా అని అన్నారు. దాంతో నాకు విశ్రాంతి దొరికింది’ అని సాయి పల్లవి చెప్పుకొచ్చారు.