Sukumar: రామ్ చరణ్‌కి జాతీయ అవార్డ్ పక్కా.. సుకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు!
శంకర్ డైరెక్షన్‌లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’. జనవరి 10న సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. అమెరికాలోని డల్లాస్‌లో నిర్వహించిన ప్రీరిలీట్ ఈవెంట్ సక్సెస్ కావడంతో మూవీ టీం ఫుల్ జోష్‌లో ఉంది. ఈ ఈవెంట్‌కి రామ్ చరణ్‌తో పాటు పుష్ప-2తో ఇండియన్ సినిమా చరిత్రలో సంచలన రికార్డులు నమోదు చేస్తున్న డైరెక్టర్ సుకుమార్ సైతం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మూవీ బ్లాక్ బస్టర్!
‘రంగస్థలం’లో రామ్‌చరణ్ నటనకు జాతీయ అవార్డు వస్తుందనుకున్నానని, ఆ లోటు ‘గేమ్ ఛేంజర్’తో తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ మూవీ క్లైమాక్స్‌లో చరణ్ నటనకు కచ్చితంగా జాతీయ అవార్డు వస్తుందని అభిప్రాయపడ్డారు. ‘నేను సినిమా చేసేటప్పుడు ప్రతి హీరోను ప్రేమిస్తా. ఆ సినిమా చేసేటప్పుడు మా అనుబంధం ఒకట్రెండేళ్లు ఉంటుంది. సినిమా అయిపోయిన తర్వాత వాళ్లతో పెద్దగా కనెక్ట్ అయి ఉండను. కానీ, ‘రంగస్థలం’ పూర్తయినా తర్వాత కూడా అనుబంధం కొనసాగిన ఒకే ఒక్క హీరో చరణ్. చిరంజీవి గారితో కలిసి ‘గేమ్ ఛేంజర్’ చూశా. ఫస్ట్ రివ్యూ నేనే ఇస్తా. ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉంది. ఇంటర్వెల్ బ్లాక్ బస్టర్. సెకండాఫ్‌లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చూస్తే గగుర్పాట కలుగుతుంది. శంకర్‌గారి సినిమాలు ‘జెంటిల్‌మెన్’, ‘భారతీయుడు’ చూసి ఎంత ఎంజాయ్ చేశానో అంతలా ఈ మూవీని కూడా ఆస్వాదించా.’ అని అన్నారు.