Tollywood: బాహుబలి, ట్రిపులార్, కల్కి.. ఇప్పుడు పుష్ప-2..! ఇండియా చూపు.. తెలుగు సినిమా వైపు!
ఇండియన్ సినిమా అంటే ఒకప్పుడు కేవలం బాలీవుడ్ మాత్రమే.. దానికి తగ్గట్టే చిత్ర రంగానికి సంబంధించి జాతీయ స్థాయి వేదికలపై కేవలం బాలీవుడ్ స్టార్స్‌కే గౌరవం, ఆదరణ లభించేవి. ముఖ్యంగా టాలీవుడ్ అన్నా, తెలుగు యాక్టర్స్ అన్న ఒకరకమైన చిన్నచూపు ఉండేది. మెగాస్టార్ చిరంజీవి అంతటి హీరోనే ఒక సందర్భంలో తెలుగు సినిమాపై చూస్తున్న చిన్నచూపు పట్ల బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేశారు. కానీ అదంతా ఒకప్పుడు.. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. ఇండియన్ ఫిలింకి కేరాఫ్ అడ్రస్‌గా టాలీవుడ్ నిలిచింది. యావత్ దేశం చూపు.. ప్రస్తుతం తెలుగు సినిమా వైపే ఉంది. దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో తెలుగు సినిమాను విశ్వవేదికపై నిలబెట్టి ఏకంగా ఆస్కార్ అవార్డుతో టాలీవుడ్‌పై పూల వర్షం కురిపించారు. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ‘కల్కి’ మూవీ తెలుగు సినిమా ఖ్యాతిని, గౌరవాన్ని మరింత పెంచింది. ఇక, ఇప్పుడు పుష్ప-2 వంతు వచ్చింది. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ – ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచం మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేస్తోంది. సుకుమార్ మార్క్ టేకింగ్, ఎంగేజ్‌డ్ స్క్రీన్ ప్లే, అల్లు అర్జున్ మార్క్ గూస్ బంప్స్ తెప్పించే యాక్షన్‌తో ఇండియన్ సినిమా హిస్టరీలోనే పుష్ప-2 ఆల్ టైం రికార్డులు సృష్టిస్తోంది. డిసెంబర్ 5న రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రప్పా.. రప్పా కలక్షన్ల సునామీ సృష్టిస్తోంది.
పుష్ప-2.. ఆల్ టైం రికార్డ్స్
ఒక తెలుగు సినిమా.. అందులోనూ సీక్వెల్ సినిమా ఏకంగా 80 దేశాల్లో విశ్వవ్యాప్తంగా 11,500లకు పైగా స్క్రీన్ల రిలీజ్ అవుతుందని కల్లోనైనా ఊహించగలమా? అలాంటి అసాధ్యాల్ని సుసాధ్యం చేసింది పుష్ప-2. రిలీజ్‌కు ముందే ప్రపంచ వ్యాప్తంగా రూ. 1000 కోట్లు వసూళ్లూ సాధించే సత్తా మన తెలుగు సినిమాకు ఉందా? అని కలగన్నామా? దాన్ని కూడా సుసాధ్యం చేసింది పుష్ప-2నే. రిలీజ్ ముందు నుంచే ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఆ హైప్ ఎంతదాకా వెళ్లిందంటే బిహార్ లోని పాట్నాలో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ యూట్యూబ్‌లోనే అత్యధిక మంది వీక్షించిన లైవ్ ఈవెంట్‌గా రికార్డు సృష్టించింది. ఇక, అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే 100 కోట్లకుపైగా రాబట్టింది. కేజీఎఫ్-2, బాహుబలి-2, కల్కి 2898 ఏడీలను అధిగమించి బుక్ మై షోలో అత్యంత వేగంగా మిలియన్ టికెట్లు అమ్ముడైన చిత్రంగా మరో రికార్డు సృష్టించింది. ఇక రిలీజైన ఫస్ట్ డే పుష్ప-2 సాధించిన కలెక్షన్స్ చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా రూ. 294 కోట్ల వసూళ్లు సాధించింది. ఇది ఎవరో అంచనా వేసిన లెక్క కాదు, ప్రొడ్యూసర్సే అధికారికంగా ప్రకటించిన లెక్క. ఈ దెబ్బతో రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ (రూ. 133 కోట్లు) రికార్డును బద్దలుకొట్టింది. ఇక, హిందీలో పుష్ప-2 ఆల్ టైం రికార్డు సృష్టించింది. అక్కడ బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటించిన ‘జవాన్’ (రూ. 65 కోట్లు) పేరిట ఉన్న రికార్డును అధిగమించి బాలీవుడ్ సెన్సేషన్ సృష్టించింది. అమెరికాలోనూ తొలి రోజు దాదాపు 4.2 మిలియన్ల డాలర్లు (రూ.35 కోట్లు పైన) వసూలు చేసింది. ఈ దెబ్బతో తెలుగు సినిమా అంటే నేషనల్ అనుకుంటివా.. ఇంటర్నేషనల్ అనే రేంజ్‌ని సెట్ చేసింది. అలా.. తెలుగు సినిమాను ఎవరూ అందుకోలేనంత ఎత్తున కూర్చోబెట్టిన సుకుమార్-అల్లు అర్జున్‌లకు కచ్చితంగా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.