Tollywood: నాగార్జున, మోహన్ బాబు, ఇప్పుడు అల్లు అర్జున్.. టాలీవుడ్‌ని కుదిపేస్తున్న వరుస ఘటనలు!
బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప-2 సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతి విశ్వవ్యాప్తమైంది. పాన్ ఇండియా లెవల్లో తెలుగు సినిమా సత్తా ఏంటో చూపించాయి. అయితే రికార్డుల పరంగా అగ్ర పరిశ్రమగా ఒక వెలుగు వెలుగుతున్న టాలీవుడ్‌కి ఈ ఏడాది అసలు కలిసిరాలేదు. వరుస ఘటనలు టాలీవుడ్‌ని కుదిపేస్తున్నాయి. నాగార్జున, మంచు మోహన్ బాబు, అల్లు అర్జున్ లాంటి అగ్రనటులు ఈ ఏడాది వార్తల్లో నిలిచారు.
అక్కినేని కుటుంబం
సమంత, నాగచైతన్య విడాకుల విషయంలో తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలతో అక్కినేని నాగార్జున తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఒకరకంగా చెప్పాలంటే మంత్రి చేసిన వ్యాఖ్యలు సినిమా వాళ్ల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీశాయనే చెప్పాలి. అయితే, నాగార్జున ఆ ఇష్యూని అంతటితో వదల్లేదు. మంత్రిపై పరువునష్టం దావా కూడా వేశారు. ఈ ఘటనలో మంత్రి వ్యాఖ్యల్ని టాలీవుడ్ మొత్తం ఏకమై ఖండించింది. సినిమా వాళ్లపై ఎటు పడితే అటు మాట్లాడితే ఊరుకునేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అక్కినేని కుటుంబానికి అండగా నిలబడింది.
‘మంచు’ ఫ్యామిలీ వార్
ఇక సీనియర్ నటుడు మోహన్ బాబు ఇష్యూ అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. కొడుకు మనోజ్ కుమార్‌తో మోహన్ బాబు వివాదం.. అటు తిరిగి.. ఇటు తిరిగి జర్నలిస్ట్‌పై దాడికి దారితీసింది. దీంతో మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు కూడా నమోదైంది. మరోవైపు జర్నలిస్ట్‌పై దాడి చేసిన మోహన్ బాబుపు జర్నలిస్టులందరూ ఏకంగా ఆందోళనకు దిగారు.
అల్లు అర్జున్ అరెస్ట్
ఇక.. ఇప్పుడు అల్లు అర్జున్. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేయడం ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశ వ్యాప్తంగానూ తీవ్ర చర్చకు దారి తీసింది. ఒక నేషనల్ అవార్డ్ విన్నర్‌తో తెలంగాణ ప్రభుత్వం, పోలీసులు వ్యవహరించిన తీరు పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఈ ఘటనలో టాలీవుడ్ అంతా ఒక్కటైంది. జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి సినీ ప్రముఖులందరూ సంఘీభావం తెలిపారు.