తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Tollywood: జానీ మాస్టర్‌పై అత్యాచారం కేసు.. అల్లు అర్జున్ స్పందన వెనుక కారణమిదేనా?

రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఫుల్ ట్రెండింగ్‌లో ఉన్న న్యూస్ జానీ మాస్టర్.. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌పై అత్యాచారం చేశాడన్న ఆరోపణలతో జానీ మాస్టర్‌పై పోలీసులు ఇప్పటికే పలు కేసులు నమోదు చేశారు. తనను పలు మార్లు లైంగికంగా వేధించాడంటూ జానీ మాస్టర్ దగ్గర వర్క్ చేసిన మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముంబయి, చెన్నైతో సహా పలు ప్రాంతాల్లో ఔట్ డోర్ షూటింగ్స్ సమయంలో తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని, ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడని తెలిపింది. తన ఇంట్లో కూడా పలుమార్లు లైంగికంగా వేధించాడని పేర్కొంది. తను ప్రతిఘటించిన ప్రతిసారి దాడి చేశాడని, తనను శారీరకంగా, మానసికంగా హింసించాడని పోలీసుకు కంప్లయింట్ చేసింది. ఆఫర్లు ఇవ్వకుండా బెదిరిస్తున్నాడని తెలిపింది. దీంతో జానీ మాస్టర్‌పై రేప్‌తో సహా పలు కేసులు నమోదు చేసిన నార్సింగి పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.

బాధితురాలికి ఇండస్ట్రీ బాసట!

ఇక, ఈ కేసు నేపథ్యంలో బాధితురాలికి టాలీవుడ్ ఇండస్ట్రీ బాసటగా నిలుస్తోంది. జానీ మాస్టర్‌పై చర్యలు తీసుకోవాలని అందరూ కోరుతున్నారు. అయితే తాజాగా ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ సైతం బాధితురాలికి అండగా నిలిచినట్లు వార్తలు వస్తున్నాయి. గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో తాను చేయబోయే అన్ని సినిమాలకు బాధితురాలికి వర్క్ ఇప్పిస్తానని హామీ ఇచ్చారట బన్నీ. ఇంతవరకు బాగానే ఉన్నా.. బన్నీ ప్రకటనపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే.. ‘పుష్ప’ సినిమాలో కీలక పాత్ర పోషించిన కేశవ అలియాస్ జగదీశ్‌పై కొన్ని రోజుల క్రితం ఓ కేసు నమోదైంది. ఓ మహిళా జూనియర్ ఆర్టిస్ట్ వేరొకరితో చనువుగా ఉన్న ఫోటోలను చూపించి జగదీశ్ ఆమెపై వేధింపులకు పాల్పడ్డాడు.. దీంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో జగదీశ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు కూడా తరలించారు. అప్పట్లో ఈ విషయం బాగా వైరల్ అయ్యింది కూడా. కానీ.. పుష్ప పార్ట్ 2లో జగదీశ్‌ది కీలక పాత్ర కాబట్టి నిర్మాత బెయిల్ ఇచ్చి మరి.. అతన్ని బయటకు తీసుకొచ్చారు. కానీ ఆ విషయంలో అల్లు అర్జున్ ఏమాత్రం స్పందించలేదని, కనీసం ఖండించలేదని.. అదే ఇప్పుడు జానీ మాస్టర్ విషయంలో మాత్రం వేగంగా స్పందించడం వెనుక వేరే కారణం ఉందని జనసైనికులు మాట్లాడుకుంటున్నారు.

అల్లు అర్జున్ అప్పుడు ఎందుకు స్పందించలేదు?

జానీ మాస్టర్ గత కొన్ని రోజులుగా జనసేన పార్టీలో చాలా చురుగ్గా ఉంటున్నారు. ఎన్నికల వేళ ఒక పాటను కూడా విడుదల చేశారు. ఒకానొక సందర్భంలో పవన్ కళ్యాణ్ జానీ మాస్టర్‌ను మెచ్చుకున్నారు కూడా. అయితే ఇవన్నీ మనసులో పెట్టుకునే జనసేనపై బురద చల్లేందుకే అల్లు అర్జున్ ఈ విషయంపై వెంటనే స్పందించారని మాట్లాడుకుంటున్నారు. అల్లు అర్జున్‌కు నిజంగా సినీ ఇండస్ట్రీపై పెద్ద మనసు ఉంటే మరి జగదీశ్ విషయంలో ఎందుకు స్పందించలేదని ప్రశ్నిస్తున్నారు.

సినీ ఇండస్ట్రీలో మహిళల భద్రతకు చర్యలు తీసుకోవాలి!

ఏది ఏమైనా మహిళలపై వేధింపులకు పాల్పడింది ఎవరైనా సరే వారికి సరైన శిక్ష పడాల్సిందే. అది జానీ మాస్టరైనా.. మరొకరైనా సరే.. శిక్ష పడాల్సిందే. ఆ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌కు న్యాయం జరిగే వరకు ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలి. అలాగే సినీ ఇండస్ట్రీలో మహిళలపై పెరుగుతున్న లైంగిక వేధింపుల నేపథ్యంలో కేరళ ప్రభుత్వం ‘హేమ’ కమిటీని ఏర్పాటు చేసినట్లు.. టాలీవుడ్ లోనూ ఓ కమిటీని ఏర్పాటు చేసి.. మహిళలకు సినీ ఇండస్ట్రీలో స్వేచ్ఛగా పని చేసుకునే హక్కును, భరోసాను కల్పించాలి. అప్పుడే ఇలాంటి వాటికి అడ్డుకట్ట పడుతుంది.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button