తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Tollywood: సీఎం రేవంత్‌ను కలవనున్న టాలీవుడ్ ప్రముఖులు!

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అల్లు అర్జున్, సీఎం రేవంత్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో టాలీవుడ్ ప్రముఖులు సీఎంతో భేటీ కానున్నట్లు వార్తలు రావడం ప్రాధాన్యం సంతరించకుంది. నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ తాము సీఎంను కలిసే యోచనలో ఉన్నట్లు తెలిపారు. రామ్‌చరణ్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’ మూవీ ప్రచారంలో భాగంగా అమెరికాలో ఉన్న నిర్మాత, ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు హైదరాబాద్‌కు తిరిగి వచ్చాక సీఎంను కలుస్తామని చెప్పారు. టికెట్ ధరల పెంపు, ప్రీమియర్ షోలపై చర్చిస్తామని అన్నారు. బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘డాకు మహారాజ్‌’ సినిమాకు నాగవంశీ నిర్మాతగా ఉన్నారు. ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల మందుకు రానుంది. ఈ సందర్భంగా నాగవంశీ మీడియాతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘సంక్రాంతి’ సినిమాలపై ప్రభావం!

సంధ్య థియేటర్‌ ఘటన తర్వాత ఈ మూవీ రిలీజ్‌ల విషయంలో ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటున్నారా? అని అడగ్గా.. ‘ఆ నిమిషంలో జరిగే దాన్ని ఎవరూ ఆపలేరు. ఈసారి నుంచి ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుంటాం. ఒక సినిమా ఎన్నో థియేటర్‌లలో రిలీజ్ అవుతుంది. ప్రతిచోటా మేం ఫాలో అప్‌ చేయలేం కదా.. ఒక వేళ అలా ఫాలో అప్‌ చేస్తామని చెప్పినా అది నమ్మశక్యంగా ఉంటుందా? మా పరిధిలో ఉన్నంతవరకూ తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. ఇటీవల జరిగిన ఘటనలు మరోసారి జరగకుండా చూసుకోవడానికి ప్రయత్నిస్తాం’ అని నాగవంశీ సమాధానమిచ్చారు. అంతేకాదు, సినీ ఇండస్ట్రీ ఏపీకి తరలిపోతుందన్న ప్రచారంపై కూడా ఆయన స్పందించారు. ‘సినీ ఇండస్ట్రీ ఏపీకి వెళుతుందనే ప్రచారం కరెక్ట్ కాదు. నేనిక్కడ డబ్బులు పెట్టి ఇల్లు కట్టుకున్నాన.. ఇప్పుడు ఏపీకి వెళ్లి ఏం చేస్తా? సినిమా ఇండస్ట్రీకి రెండు తెలుగు రాష్ట్రాలు సమానమేనని అన్నారు. కాగా.. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన తర్వాత అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తాను సీఎం కుర్చీలో ఉన్నంతవరకు బెనిఫిట్ షోలకు, టిక్కెట్స్ రేట్స్ పెంచుకునేందుకు అనుమతులు ఇవ్వనని తేల్చిచెప్పారు. సీఎం తీసుకున్న నిర్ణయంతో సంక్రాంతికి రిలీజ్ కానున్న సినిమాల కలెక్షన్లపై ఆ ప్రభావం పడనుంది.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button