తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP: లేని సంపద సృష్టి… ఉన్నదల్లా అప్పులే… ఇది ఏపీ ప్రభుత్వ తీరు!

అప్పులు చేయడం ద్వారా కాకుండా, సంపద సృష్టించడం ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానంటూ ఎన్నికల ముందు పెద్ద పెద్ద మాటలు చెప్పిన చంద్రబాబు.. తీరా గద్దెనెక్కాక అందుకు విరుద్దంగా అడుగులు వేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి ప్రతి మంగళవారం అప్పు చేయనిదే గడవదని ఎల్లో మీడియా కథనాలను రాయడం, వాటి ఆధారంగా చంద్రబాబు అండ్‌ కో రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్నారంటూ ఆరోపణలు చేయడం తెలిసిందే. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం కేవలం 35 రోజుల వ్యవధిలోనే ఏకంగా రూ.12 వేల కోట్లు అప్పు చేసినా, ఎల్లో మీడియా ఒక్క ముక్క కూడా రాయడం లేదు ఎందుకో అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

గత నెల 25వ తేదీన రూ.2 వేల కోట్ల అప్పుతో చంద్రబాబు ప్రభుత్వం అప్పులు చేయడం ప్రారంభించింది. ఆ తర్వాత ఈ నెల 2వ తేదీన ఒకేసారి రూ.5,000 కోట్లు అప్పు చేసింది. 16వ తేదీన మరో రూ.2,000 కోట్లు అప్పు చేసింది. తాజాగా మంగళవారం సెక్యూరిటీల వేలం ద్వారా ఆర్‌బీఐ రాష్ట్ర ప్రభుత్వానికి రూ.3,000 కోట్ల రుణాన్ని సమీకరించింది. ఇందులో రూ.1,000 కోట్లు 15 సంవత్సరాల కాల వ్యవధికి, మరో రూ.1,000 కోట్లు 20 సంవత్సరాల కాల వ్యవధికి, ఇంకో రూ.1,000 కోట్లు 25 సంవత్సరాల కాల వ్యవధికి 7.34 శాతం వడ్డీతో అప్పు చేసింది. ఈ లెక్కన నెల ఐదు రోజుల్లోనే కూటమి ప్రభుత్వం రూ.12 వేల కోట్లు అప్పు చేసింది.

ఇంత అప్పు చేసినా ఒక్క పెన్షన్‌ పెంపు తప్ప మిగతా హామీల్లోని ఏ ఒక్కదాని అమలు ప్రారంభించలేదు. మరి ఈ అప్పులన్నీ దేనికి వ్యయం చేసినట్లో చంద్రబాబు అండ్‌ కో తో పాటు ఎల్లో మీడియా చెప్పాల్సి ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఏం చెప్పారని, ఇప్పుడు ఏం చేస్తున్నారని ఆర్థిక వేత్తలు నిలదీస్తున్నారు.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button