AP Inter: ఇంటర్ విద్యలో కీలక సంస్కరణలు.. ఫస్ట్ ఇయర్ పరీక్షలకు చెల్లుచీటీ?
ఇంటర్మీడియట్ విద్యలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక మార్పులు చేసేందుకు సిద్ధమైంది. ఫస్ట్ ఇయర్ బోర్డు ఎగ్జామ్‌ను తొలగించాలనే ప్రతిపాదనలు తీసుకొచ్చినట్టుగా బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా తెలిపారు. అయితే సెకండర్ పరీక్షలు మాత్రం యధాతథంగా ఉంటాయన్నారు. కొత్త సబ్జెక్టుల కాంబినేషన్‌తో పాటు, మార్కుల విధానంలో మార్పులు తీసుకొస్తున్నట్టుగా తెలిపారు. ఈ మేరకు ఇంటర్ విద్యలో సమూల మార్పులు చేపడుతున్నామని.. అయితే ఇవన్నీ ప్రతిపాదనలు మాత్రమేనని తెలిపారు. అంతేకాదు, ఇంటర్ విద్యలో సంస్కరణలపై విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తల నుంచి సలహాలు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు.
జాతీయ కరికులం చట్టాన్ని అనుసరించి..!
ఈ సందర్భంగా కృతికా శుక్లా కీలక వ్యాఖ్యలు చేశారు. చాలా ఏళ్లుగా ఇంటర్ విద్యలో సంస్కరణలు జరగలేదని గుర్తుచేశారు. జాతీయ కరికులం చట్టాన్ని అనుసరించి సంస్కరణలు చేపడుతున్నామని వివరించారు. ‘15 రాష్ట్రాల్లో ఎన్‌సీఈఆర్టీ పాఠ్యపుస్తకాలను ఇంటర్‌లో ప్రవేశపెట్టారు. సిలబస్ సంస్కరణ, నూతన సబ్జెక్ట్ కాంబినేషన్లకు ప్రతిపాదనలు చేస్తున్నాం. పరీక్షల మార్కుల కేటాయింపు విధానంలో సంస్కరణలు తెస్తాం. ఇందులో భాగంగా ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షలు తొలగిస్తాం. ఆయా కళాశాలలు అంతర్గతంగా ప్రథమ సంవత్సర పరీక్షలు నిర్వహిస్తాయి. ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలనే బోర్డు నిర్వహిస్తుంది. ఈ నెల 26 లోగా సంస్కరణలపై సలహాలు, సూచనలు పంపాలి.’ అని అన్నారు.