AP: పేదల వైద్య, విద్యపై జగన్‌కు ఉన్న చిత్తశుద్ది… చంద్రబాబులో కొరవడిందా?
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రారంభంపై చంద్రబాబు ప్రభుత్వం కావాలనే నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. మన విద్యార్థులకు వైద్య, విద్య అవకాశాలను పెంచడంతో పాటు, నిరుపేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని చేరువ చేసే లక్ష్యంతో ఏకంగా రూ.8 వేల కోట్లకుపైగా నిధులతో 17 ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణానికి గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వీటిలో ఐదు వైద్య కళాశాలలను గత ఏడాది ప్రారంభించగా, మరో ఐదు ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించడానికి చర్యలు తీసుకుంది.
ఈ క్రమంలో ఈ ఏడాది మదనపల్లె, మార్కాపురం, పులివెందుల, ఆదోని, పాడేరు కళాశాలల్లో ఒక్కో చోట 100 ఎంబీబీఎస్ సీట్లతో తరగతులు ప్రారంభించాల్సి ఉంది. అయితే ఈ కళాశాలలను ప్రారంభిస్తే వైఎస్ జగన్‌కు క్రెడిట్ దక్కుతుందని కూటమి ప్రభుత్వం.. అనుమతులు రాబట్టడంలో చిత్తశుద్ధితో చర్యలు తీసుకోవడం లేదు.
ప్రారంభించిన వైద్య కళాశాలలపై చంద్రబాబు నిర్లక్ష్యం
- ఈ ఐదు వైద్య కళాశాలల కోసం గత వైఎస్ జగన్ ప్రభుత్వం 250కి పైగా వైద్యుల పోస్టులు, దాదాపు సరిపడా సంఖ్యలో సిబ్బంది పోస్టులను భర్తీ చేసింది. ఇంకా ఎన్‌ఎంసీ నిబంధనలకు అనుగుణంగా మరో 380 పోస్టుల భర్తీకి అనుమతులు ఇచ్చింది. ఇంతలో చంద్రబాబు ప్రభుత్వం రావడంతో వీటిని భర్తీ చేయాలని తొలి సమీక్షలోనే వైద్య శాఖ సీఎం దృష్టికి తీసుకెళ్లినా అనుమతులు ఇవ్వలేదు.
- పలు స్పెషాలిటీల్లో ఎన్నిసార్లు నోటిఫికేషన్‌లు ఇచ్చినా వైద్యులు రావడం లేదని గిరిజన ప్రాంతాల్లో 50 శాతం, గ్రామీణ ప్రాంతంలో 30 శాతం అదనపు ప్రోత్సహం ఇవ్వడంతో పాటు, కాంట్రాక్ట్ విధానంలో ప్రొఫెసర్, అసోసియేట్‌లను తీసుకోవాలని గతంలోనే నిర్ణయించారు. వీటిని కొనసాగించకుండా ఈ ప్రభుత్వం అడ్డుకుంది.
- 313 స్టాఫ్ నర్సుల పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసి జాబితా ప్రకటించి, వారికి పోస్టింగ్‌లు ఇచ్చే సమయంలో టీడీపీ ప్రజాప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారని ఉత్తర్వులు ఇవ్వకుండా నిలిపి వేశారు. స్టాఫ్ నర్సులు లేక ఆయా బోధనాస్పత్రుల్లో వైద్య సేవలపై ప్రభావం పడుతున్నా ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.
చిత్తశుద్దితో జగన్ అడుగులు
పేద, మధ్య తరగతి విద్యార్థులకు వైద్య, విద్యను చేరువ చేయడం కోసం వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో చిత్తశుద్ధితో అడుగులు వేశారు. గత ఏడాది విజయనగరం, ఏలూరు, రాజమండ్రి, మచిలీపట్నం, నంద్యాల కళాశాలల్లో తొలి విడత తనిఖీల్లో ఒక్క విజయనగరానికి మాత్రమే అనుమతులు లభించాయి. రెండో విడత తనిఖీల్లో అనుమతులు రాబట్టడం కోసం చిత్తశుద్ధితో అప్పట్లో ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రస్తుత ప్రభుత్వానికి కూడా పేదల ఆరోగ్యం, విద్యార్థుల ఆకాంక్షల పట్ల చిత్తశుద్ధి ఉండి ఉంటే అదే తరహాలో చర్యలు తీసుకుని ఉండేదని వైద్య వర్గాల్లోనే చర్చ నడుస్తోంది.