AP Politics: విమర్శిస్తే కేసులు.. ప్రశ్నిస్తే అరెస్టులు.. ఇందుకేనా కూటమికి అధికారం ఇచ్చింది?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంలో చంద్రబాబు నాయుడు ఓ సందర్భంలో మాట్లాడుతూ తమది కక్షసాధింపుల ప్రభుత్వం కాదని, రాజకీయ స్వార్థ్యంతో ఎవరి మీద తాము కక్షసాధించబోమని.. రాష్ట్రాభివృద్ధే తమ ప్రథమ ప్రాధాన్యమని అన్నారు. అభివృద్ధి మాట దేవుడెరుగు కానీ.. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు.. వైసీపీ నాయకుల మీద, నాడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ మీద విమర్శలు చేసిన నాయకులను, సినిమా రంగానికి చెందిన వారిని టార్గెట్ చేయడమే పనిగా పెట్టుకుంది. నందిగం సురేశ్ నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దాకా.. ఆర్జీవీ నుంచి పోసాని దాకా కేసులు, అరెస్టులతో కక్షసాధింపులకు దిగుతోంది కూటమి ప్రభుత్వం.
ప్రశ్నిస్తే అరెస్టులేనా?
ఇక సోషల్ మీడియాపైన ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపిన వారిపై పోలీసులు తమ ప్రతాపం చూపిస్తున్నారు. సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసులు పెడుతూ వేధిస్తున్నారు. సోషల్ మీడియాలో మహిళలపై అభ్యంతరకర పోస్టులు పెట్టిన వాళ్లపై కేసులు పెట్టడాన్ని ఎవరూ తప్పు పట్టరు. కానీ ఆ సాకుతో ప్రత్యర్థులను భయకంపితుల్ని చేయాలనే ఆత్రుత కూటమి సర్కార్‌లో కనిపిస్తోందన్న చర్చ జరుగుతోంది. టీడీపీ, జనసేన యాక్టివిస్టులు సోషల్ మీడియాలో వైసీపీ నేతలపై నీచంగా పోస్టులు పెట్టినా కేసులు మాత్రం ఉండడం లేదు. వైసీపీ నేతలు పదే పదే ఫిర్యాదులు చేస్తున్నా పోలీసులు మాత్రం పట్టించుకోవడం లేదు. కానీ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క పోస్టు పెట్టినా వెంటనే పోలీసులు రంగంలోకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలోనే అసలు ప్రజలకు తమకు అధికారం ఇచ్చింది ప్రత్యర్థులపై కేసులు పెట్టి వేధించడానికేనా? అనే అనుమానం, ప్రశ్న తలెత్తుతోంది.
తెగ దాకా లాగొద్దు!
ఎవరైనా సరే తెగ దాకా లాగితే వారికే నష్టం.కేసుల పేరుతో అందర్నీ భయపెట్టాలని అనుకోవడమే సరైన ఆలోచన కాదు. ఏదైనా సరే ఎక్కువైతే ఆ తర్వాత ఏదైతే అది అవుతుందనే తెగింపు వస్తుంది. ప్రస్తుతం కూటమి సర్కార్ కేసులతో భయపెట్టాలనే ప్రయత్నం వైసీపీలో తెగింపు తీసుకొచ్చింది. ఇందుకు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి హెచ్చరికే నిదర్శనం. తనను జైల్లో పెడితే కనీసం బెయిల్ కోసం ప్రయత్నం కూడా చేయనని ఆయన స్పష్టం చేశారు. చెవిరెడ్డిలాగే రానున్న రోజుల్లో వైసీపీ జైల్‌భరోకు పిలుపు ఇవ్వాలనే ఆలోచన కూడా చేస్తున్నట్టు సమాచారం. ఎంత మందిని జైల్లో వేస్తారో వేసుకోండని, వాళ్లంతా రోడ్డు మీదకి రానున్నట్లు తెలుస్తోంది.