Budameru: బుడమేరు వరద గురించి ముందస్తు సమాచారం ఎందుకు ఇవ్వలేదు? ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు చురకలు!
విజయవాడను ముంచేసిన బుడమేరు వరదల విషయంలో కూటమి ప్రభుత్వానిదే తప్పన్న వాదనలు మరోసారి తెరపైకి వచ్చాయి. బుడమేరు వరద విజయవాడను ముంచెత్తడం, భారీ నష్టం కలిగించడం తెలిసిందే. ఈ వరదల్లో ఎందరో తమ సొంతిళ్లను, కోల్పోయి నిరాశ్రయులుగా మిగిలారు. అయితే ఈ వ్యవహారంలో కూటమి ప్రభుత్వానికి హైకోర్టు చురకలు అంటించింది. బుడమేరు వరద గురించి ముందస్తుగా జనానికి ఎందుకు సమాచారం ఇవ్వలేదని ప్రశ్నిస్తూ ఏపీ హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.
వాతావరణ శాఖ హెచ్చరించినా పట్టించుకోలేదు!
విజయవాడను గతంలో ఎన్నడూ లేని విధంగా వరదలు ముంచెత్తడం కేవలం ప్రకృతి విపత్తుగా కాదని, ప్రభుత్వ తప్పిదంగా చూడాలని వరదల సమయంలో విపక్షాలు ఆరోపించిన సంగతి తెలిసిందే. తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఎంతో ముందుగానే ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. అయినప్పటికీ తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. విజయవాడలోని మునక ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహించారు. దీంతో ఆకస్మిక వరదలు రోజుల తరబడి కొందర్ని నిరాశ్రయుల్ని చేశాయి. తమకు వరదల గురించి ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ, లక్షలాది మందిని పునరావాస కేంద్రాలకు తరలించడం సాధ్యం కాదనే ఉద్దేశంతో ఏం చేయలేకపోయామని సీనియర్ ఐఏఎస్ అధికారి సిసోడియా చెప్పడం విమర్శలకు దారి తీసింది.