Chandrababu: చంద్రబాబు పాలనపై సొంత పార్టీ నేతల అసంతృప్తి?
భారత రాజకీయాల్లోనే అపార అనుభవం ఉన్న సీఎం ఆయన.. ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కంటే కూడా సీనియర్.. భారత రాజకీయాలను తారుమారు చేయగల సామర్థ్యం ఉన్న నేత.. ఇవన్నీ ఎవరి గురించో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. సమయం దొరికినప్పుడల్లా, నోటి ముందుకు మైక్ వచ్చిన ప్రతిసారి ఇటు చంద్రబాబు నాయుడు..గానీ అటు తెలుగు ‘తమ్ముళ్లు’ గానీ ఊదరగొట్టే మాటలివే కదా.. మరి అంతటి అనుభవం గల చంద్రబాబు నాయుడు.. ఈసారి ఒక ముఖ్యమంత్రిగా పాలనలో తన మార్క్ ఎందుకు చూపించలేకపోతున్నారు? సీఎం కుర్చీలో చంద్రబాబే ఉన్నా.. పరిపాలన మాత్రం మరెవరో చేస్తున్నారనే భావన ప్రజల్లో ఎందుకు కలుగుతోంది?
చంద్రబాబు మార్క్ పాలన ఏది?
సాధారణంగా చట్టం అంటే భయం భక్తులతో చంద్రబాబు నడుచుకుంటారని పేరుంది. కానీ ప్రస్తుత పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉన్నాయి. రాష్ట్రంలో రోజురోజుకి మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. ఇక లా అండ్ ఆర్డర్ సరిగా లేదని ఏకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణే ఒప్పుకున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిపై కేసులు పెట్టి ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. ఈ పరిణామాలతో అధికారంలోకి వచ్చి ఇంకా ఆరు నెలలు కూడా కాకముందే కూటమి పాలనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అయితే చంద్రబాబు తన పాలనను సమర్థవంతంగా నిర్వహించలేకపోవడమే ఇందుకు కారణమని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు.
అంతా తానై చక్రం తిప్పుతున్న లోకేశ్, పవన్!
కూటమి అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి లోకేశ్ అన్నీ తానై పాలనలో చక్రం తిప్పుతున్నారు. ఇప్పుడు తానేం తక్కువ అంటూ పవన్ కళ్యాణ్ కూడా అధికారం చెలాయించడానికి అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. తాజాగా సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్ట్‌లకు కారణం వెనుక పవన్‌ను సంతృప్తిపరచడానికే అని టీడీపీ నేతలు అంటున్నారు. ఇటు తనయుడికి నచ్చచెప్పలేక, అటు పవన్ కళ్యాణ్‌ని నివారించలేక చంద్రబాబు మల్లగుల్లాలు పడుతున్నారట. అందుకే ఈసారి చంద్రబాబు తన ఆలోచనల ప్రకారం పరిపాలన చేయలేకపోతున్నారని సొంత పార్టీ నాయకులే వాపోతున్నారు. అందుకే గతంలో ఎప్పుడూ లేని విధంగా కేవలం ఐదు నెలల్లోనే కూటమికి చెడ్డ పేరు వచ్చిందని టీడీపీ నేతలు చెబుతున్నారు.