
చంద్రబాబు, లోకేశ్‌ల దావోస్ పర్యటన ‘ఆర్భాటాలెక్కువ.. అందింది తక్కువ’ అన్న చందాన ముగిసింది. ఏపీకి పెట్టుబడుల వేట కోసమంటూ ఎంతో హంగూ, ఆర్భాటాల మధ్య దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సుకు చంద్రబాబు, లోకేశ్ వెళ్లారు. అయితే, హడావిడే తప్ప ఈ పర్యటనతో రాష్ట్రానికి చెప్పుకోదగ్గ పెట్టుబడులేవీ దక్కలేవని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. రూ.3 కోట్లకు పైగా ఖర్చు చేసి మరి జాతీయ మీడియాలో ఇంటర్వ్యూలు ఇచ్చినా ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ కంపెనీలేవీ ముందుకు రాలేవని చెబుతున్నారు.
అంతా పబ్లిసిటీనే..
బిల్ గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ కేవలం పబ్లిసిటీకే పరిమితమైందని అంటున్నారు. ఏపీలో ఎలాంటి కొత్త ప్రాజెక్టుకు మైక్రోసాఫ్ట్ ఎంవోయూ చేసుకోలేదు. ప్రతిష్టాత్మక దావోస్ సదస్సులో లోకేశ్ రెడ్ బుక్ ప్రస్తావన తెచ్చి పారిశ్రామికవేత్తలకు ప్రతికూల సందేశం పంపారని, ఇక, లోకేశ్ సీఎం కావాలంటూ పరిశ్రమల మంత్రి టీజీ భరత్ చేసిన భజనతో రాష్ట్రానికి అపఖ్యాతి తెచ్చారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఏపీకి వచ్చిన పెట్టుబడులన్నీ కేవలం సోషల్ మీడియాలో పోస్టర్లకు, టీడీపీ అనుకూల మీడియాలో హెడ్ లైన్స్‌కి మాత్రమే పరిమితమయ్యాయని విమర్శలు గుప్పిస్తున్నాయి.
తెలంగాణ, మహారాష్ట్రలకు భారీగా పెట్టుబడులు
దావోస్ సదస్సులో ఏపీతో పోల్చితే తెలంగాణ, మహారాష్ట్రలకు భారీగా పెట్టుబడులు వచ్చాయి. మహారాష్ట్ర ప్రభుత్వం రూ. 9.3 లక్షల కోట్లు, తెలంగాణ ప్రభుత్వం రూ.56,300 కోట్ల పెట్టుబడులకు ఎంవోయూలు చేసుకున్నాయి. తెలంగాణలో మొత్తం మూడు కంపెనీలు కలిసి రూ. 56 వేల కోట్లకు పైగా పెట్టుబడుల్ని పెట్టనున్నాయి. తద్వారా రాష్ట్రంలో 10,800 మంది యువతీయువకులకు ఉద్యోగాలు దక్కనున్నాయి. రాజకీయాల్లో, పాలనలో ఎంతో అపార అనుభవం ఉందని చెప్పే చంద్రబాబు కనీసం తన శిష్యుడు రేవంత్ రెడ్డి రాబట్టినన్ని పెట్టుబడులు కూడా రాబట్టకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.