ఆంధ్రప్రదేశ్
AP Floods: ఏపీ వరద బాధితులకు రూ. 25 కోట్ల విరాళం ప్రకటించిన గౌతమ్ అదానీ
ఇటీవల భారీ వర్షాలు, వరదలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అతలాకుతలమైంది. ఓ వైపు భారీ వర్షాలు.. మరోవైపు కృష్ణానదికి వరద. ఇంకోవైపు బుడమేరు కాలువకు గండ్లు పడడంతో విజయవాడ తీవ్ర ముంపునకు గురైంది. ఇక, రాష్ట్రవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో వరదలు తీరని నష్టాన్ని మిగిల్చాయి. ఈ క్రమంలో వరద బాధితులను ఆదుకునేందుకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సహా వ్యాపారవేత్తలు సైతం ముందుకొస్తున్నారు. సీఎం సహాయ నిధికి తమ వంతు విరాళం అందిస్తున్నారు.
రూ. 25 కోట్ల విరాళం
వరదలతో అల్లాడిన ఏపీకి సాయం చేసేందుకు తాజాగా అదానీ గ్రూప్ ముందుకొచ్చింది. అదానీ ఫౌండేషన్ తరుఫున రూ. 25 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించింది. ఈ మేరకు అదానీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ గౌతమ్ అదానీ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. సంబంధిత పత్రాలను సంస్థ ఎండీ కిరణ్ అదానీ సీఎం చంద్రబాబుకు అందిస్తోన్న ఫోటోను షేర్ చేశారు.