Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన మాజీ సీఎం జగన్!
తిరుమల లడ్డూ వివాదంపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించారు. డైవర్షన్ పాలిటిక్స్ చేయడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారంటూ మండిపడ్డారు. ఈ మేరకు ఇవాళ మీడియా సమావేశం నిర్వహించారు. బాబు నీచ రాజకీయాలను ఆయన ఎండగట్టారు. రాజకీయాల కోసం దేవుడ్ని కూడా వాడుకునే నైజం చంద్రబాబుది అంటూ దుయ్యబట్టారు.
వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే!
‘తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు కట్టుకథలు చెబుతున్నారు. నెయ్యికి బదులు జంతు కొవ్వు వాడారని దుర్మార్గపు మాటలు మాట్లాడుతున్నారు. సీఎంగా ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడటం కరెక్టేనా? కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీయడం సబబేనా? దశాబ్దాల తరబడి ఒకే విధానంలో లడ్డూ తయారీ సామాగ్రి కొనుగోలు ప్రక్రియ జరుగుతుంది. ప్రతి ట్యాంకర్ ఎన్‌ఏబీఎల్ సర్టిఫికెట్ తీసుకుని రావాలి. ఆ తర్వాత టీటీడీ మూడు శాంపిల్స్‌ను తీసుకుని టెస్ట్ చేస్తుంది. ఈ టెస్ట్‌లు పాసైతేనే ఆ సామాగ్రిని టీటీడీ అనుమతిస్తుంది. ఈ విధానమంతా దశాబ్దాల నుంచి జరుగుతుంది. జూలై 12న శాంపిల్స్ తీసుకున్నారు. ఆ సమయంలో సీఎంగా ఉన్నది చంద్రబాబే. మూడు టెస్ట్‌లు చేశాక జూలై 17న ఎన్‌డీడీబీకి పంపారు. 2 నెలలు క్రితం రిజక్ట్ అయితే ఇప్పటివరకు బాబు ఏం చేస్తున్నారు?’ అని వైఎస్ జగన్ ప్రశ్నించారు.