Jagan: దోచుకో.. పంచుకో.. తినుకో.. అంతా మాఫియా మయం.. కూటమి పాలనపై జగన్ సంచలన వ్యాఖ్యలు!
ఏపీలోని కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లిలో నిర్వహించిన ప్రెస్ మీట్ కూటమి పాలనపై తీవ్ర ఆరోపణలు చేశారు. అబద్ధాలు ప్రచారం చేసి కూటమి ఎన్నికల్లో గెలిచిందన్నారు. ప్రజలు మోసపు మాటలను నమ్మి ఓట్లు వేశారని, రాష్ట్రాన్ని కూటమి నిండా ముంచేసిందన్నారు. గత ఐదు నెలలుగా ఎక్కడా డీబీటీ విధానం కనిపించలేదని, కూటమి పాలనలో డీబీటీ అంటే దోచుకో, పంచుకో, తినుకో అనే రీతిలో ఉందన్నారు.
మద్యం విధానంలో అవినీతి
ఇక, నూతన మద్యం విధానంలో అవినీతి జరిగిందన్నారు. గత ప్రభుత్వంలో నాసిరకం మద్యం విక్రయించారని ప్రచారం చేశారని, ఇప్పుడు మాత్రం నాణ్యమైన లిక్కర్ అంటూ కూటమి నేతలు ఊదరగొడుతున్నట్లు తెలిపారు. వైసీపీ హాయంలో ఒక్క డిస్టీలరీకి కూడా లైసెన్స్ ఇవ్వలేదని, మద్యం సాకుగా చూపి రాష్ట్రంలో కుంభకోణానికి తెర లేపారన్నారు. చంద్రబాబు హయాంలోనే కొత్త కొత్త బ్రాండ్లు తీసుకు వచ్చారని, రాష్ట్రంలో మాఫియా రాజ్యమేలుతుందని విమర్శించారు. నూతన మద్యం విధానం అంటూ.. చివరకు మద్యం ప్రియులను కూడా ప్రభుత్వం మోసం చేసిందన్నారు.
సూపర్ సిక్స్ ఎక్కడ?
అసెంబ్లీ ఎన్నికల సమయంలో సూపర్-6 అంటూ ఊదరగొట్టిన కూటమి, ఇప్పుడు వాటి అమలును మరిచిపోయిందని జగన్ అన్నారు. అలాగే అధికారం వచ్చేంతవరకు ఒక రకం, అధికారం చేజిక్కించుకున్నాక ఇప్పుడు రాష్ట్రం గడ్డుకాలంలో ఉందని చెబుతాన్నరని విమర్శించారు. ఇక సూపర్ సిక్స్ లేదు.. సెవెన్ లేదు.. ఒకటే ఒకటి అబద్దపు హామీలే ప్రజలకు దిక్కయ్యాయని జగన్ అన్నారు.
ఫ్రీ ఇసుక ఏది?
కూటమి పాలనలో ఇసుక ఫ్రీ అంటూ చేసిన ప్రకటనలు.. కేవలం ప్రకటనలకే పరిమితమయ్యాయన్నారు. నేడు ఒక్కొక్క జిల్లాలో రూ.60 వేలు చొప్పున, మరికొన్ని జిల్లాలలో రూ.14 వేల చొప్పున విక్రయిస్తున్నారన్నారు. ఇసుక మాఫియా రాజ్యమేలుతుందని, సాక్షాత్తు చంద్రబాబు ఇంటి ప్రక్కనే ఇసుక అక్రమంగా త్రవ్వుతున్నట్లు ఆరోపించారు. అంతేకాదు, రాష్ట్రంలో కమీషన్ ఇవ్వనిదే ఏ పనులు సాగడం లేదని, అంతా అవినీతిమయం అయిందంటూ జగన్ తీవ్ర విమర్శలు చేశారు.