Jagan vs Sharmila: జగన్, షర్మిల ఆస్తుల వివాదంలోకి పవన్ కళ్యాణ్ ఎంట్రీ.. అసలేం జరుగుతోంది?

సరస్వతీ పవర్ కంపెనీలో వాటాల విషయంలో మాజీ సీఎం జగన్, ఆయన సోదరి షర్మిల మధ్య వార్ నడుస్తోంది. సరస్వతీ పవర్ సంస్థలో గతంలో అధిక భాగం షేర్లను చెల్లెలు షర్మిలకు, తల్లి వై.ఎస్. విజయమ్మకు జగన్మోహన్ రెడ్డి కేటాయించారు. ఇప్పుడు ఆయన ఆ గిఫ్ట్ డీడ్‌ను రద్దు చేసుకోవాలని అనుకుంటున్నారు. రాజకీయంగా తనతో విభేదించినందువలన తనపై వ్యక్తిగత ఆరోపణలతో పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్నందువలన ఆ గిఫ్ట్ డీడ్ రద్దు చేయాలని చెబుతున్నారు. ఈ మేరకు జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్‌లోని జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఏపీలో ఈ ఇష్యూనే ఇప్పుడు హాట్ టాపిక్.
ఏదైనా కొత్త వ్యూహమా?
అయితే, ఉన్నట్టుండి ఈ ఇష్యూలోకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చారు. పవన్ చేతిలో పంచాయతీరాజ్‌తో పాటు అటవీశాఖ కూడా ఉన్న సంగతి తెలిసిందే. పల్నాడు జిల్లా దాచేపల్లి, మాచవరం మండలాల్లో సరస్వతీ పవర్ సంస్థ భూముల్లో అటవీ భూములు ఏమైనా ఉన్నాయా? అని పవన్ అధికారుల్ని ఆరా తీస్తున్నారు. ఈ మేరకు పూర్తి వివరాలు తనకు అందజేయాలని అధికారులకు ఆదేశాలు సైతం జారీ చేశారు. సరస్వతీ పవర్ కంపెనీకి భూములు ఎప్పుడో ఇచ్చినవి. 2009 మే 18న సరస్వతీ పవర్ సంస్థకు దాచేపల్లి, మాచవరం మండలాల పరిధిలో 1,515.93 భూముల్ని ఇచ్చారు. ఆ తర్వాత టీడీపీ ప్రభుత్వం సదరు కంపెనీకి సున్నపురాయి లీజుల్ని రద్దు చేసింది. అనంతరం వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పునరుద్ధరించింది. నిజంగా ఆ భూముల్లో అటవీ భూములుంటే చంద్రబాబు ఊరుకునే వారా? కాదు కదా.. అయినా పవన్ మాత్రం ఈ విషయంలో ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? అంటే పవన్‌ను అడ్డు పెట్టుకుని జగన్‌పై చంద్రబాబు మళ్లీ ఏదైనా కొత్త వ్యూహం రచిస్తున్నారా? అన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.