Janasena: ముహూర్తం ఫిక్స్.. జనసేనలో చేరేందుకు క్యూ కడుతున్న నేతలు..!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. జనసేన పార్టీలోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. జనసేనలో చేరేందుకు వైసీపీ నేతలు క్యూ కడుతున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన సీనియర్ వైసీపీ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డితో పాటు పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య, జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను జనసేన కండువా కప్పుకోనున్నారు. ఈ నెల 26న మంగళగిరిలో నిర్వహించే కార్యక్రమంలో వీరు జనసేన పార్టీలో చేరనున్నారు. పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో వీరు పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు.
ఇక, అదే రోజు విజయనగరం జిల్లాకు చెందిన వైసీపీ యూత్ జోనల్ ఇంఛార్జ్ విక్రమ్, విజయనగరం, పార్వతీపురం జిల్లాల డీసీఎంఎస్ చైర్ పర్సన్‌గా ఉన్న డాక్టర్ అవనపు భావన కూడా అధినేత పవన్ సమక్షంలో జనసేనలో చేరతారని ఆ పార్టీ రాజకీయ కార్యదర్శి ప్రకటించారు. అలాగే, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి, ప్రకాశం జిల్లాకు చెందిన డా.యాదాల అశోక్ బాబు, నాగులుప్పలపాడు జడ్పీటీసీ డా. యాదాల రత్న భారతి పవన్ పార్టీలో చేరనున్నారు. ఇక, విజయవాడ, గుంటూరు, తిరుపతి నగర పాలక సంస్థల నుంచి పలువురు కార్పొరేటర్లు కూడా జనసేన కండువా వేసుకోనున్నారు.