Janasena: అధినేత అలా.. నాయకులు ఇలా..! జనసేనలో వరుస రేవ్ పార్టీల కలకలం!
జనసేన పార్టీలో వరుస రేవ్ పార్టీలు కలకలం రేపుతున్నాయి. రోజురోజుకు ఈ కల్చర్ ఆ పార్టీ పరువును బజారున పడేస్తోంది. మొన్నటి మొన్న నిడమర్రు జనసేన మండల అధ్యక్షుడు తన పుట్టినరోజున రేవ్ పార్టీని జరిపిన విషయం మరువకముందే, నూతన సంవత్సర వేడుకల సందర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో జనసేన నాయకుడు వేలువూరి ముత్యాలరావు అలియాస్ ముత్తు ఆధ్వర్యంలో జరిగిన రేవ్ పార్టీ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
సొంత పార్టీలోనే విమర్శలు
పార్టీ అధినేతేమో పవన్ కళ్యాణేమో సనాతన ధర్మం, హిందూ ధర్మ పరిరక్షణ, మన సంప్రదాయాలు, కట్టుబాట్లు అంటూ పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తుంటే.. నాయకులేమో ఇలా రేవ్ పార్టీల్లో అడ్డంగా దొరకడం పట్ల సొంత పార్టీలోనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అంతేకాదు, పవన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మైక్ దొరికితే చాలు.. వైసీపీ హయాంలో ఆడబిడ్డల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని తెగ ఊదరగొట్టేవారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఏకంగా సొంత పార్టీ నాయకులే నడిరోడ్డుపై రేవ్ పార్టీల పేరుతో ఆడవాళ్లతో బట్టలు విప్పించి డ్యాన్సులు చేయిస్తుంటే పవన్ మౌనంగా ఉండటం పట్ల కూడా సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. అయితే, ఇంత జరిగినా జనసేన నేతలపై కేసులు నమోదు చేయొద్దంటూ పోలీసులపై ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తున్నట్లు కూడా వినిపిస్తోంది. ఈ ఘటన మూడు రోజుల క్రితం జరిగితే, ఇప్పుడు వీడియోలు బయటకు రావడం వెనుక కూటమి నేతల హస్తం ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.