Madhavi Latha: తగ్గేదేలే.. జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఫిర్యాదు చేసిన నటి మాధవీలత!

తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి.. సినీ నటి, బీజేపీ నాయకురాలు మాధవీలతల మధ్య నెలకొన్న వివాదం ఇప్పట్లో సర్దుమణిగేలా లేదు. జేసీ చెప్పిన బహిరంగ క్షమాపణలపై మాధవీలత సంతృప్తి చెందలేదు. జేసీ వ్యాఖ్యలతో తాను ఎంతో కలత చెందానని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)లో ఫిర్యాదు చేశారు. ఇదే విషయమై హెచ్ఆర్సీ, పోలీసులకు సైతం ఆమె ఫిర్యాదు చేశారు. జేసీ వ్యాఖ్యలను ఇండస్ట్రీ ఖండించలేదని.. ఈ కారణంగానే మూవీఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కు ఫిర్యాదు చేశానని చెప్పారు. ఆరోపణలు చేయడం సరికాదని, వ్యక్తిత్వ హననడం చేయడం దారుణం అని మాధవీలత ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసలు.. వివాదం ఏంటి?
తాడిపత్రిలోని జేసీ పార్కులో డిసెంబర్ 31న న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించారు. మహిళల కోసం ప్రత్యేకంగా ఈ వేడుకలను ఏర్పాటు చేశారు. అయితే ఈ వేడుకలకు మహిళలు వెళ్లొద్దని, వారి రక్షణకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉందంటూ మాధవవీలత వీడియో రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద స్పందించిన జేసీ ప్రభాకర్ రెడ్డి మాధవీలతపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. మరోవైపు మాధవీలతపై చర్యలు తీసుకోవాలని టీడీపీ మహిళా కౌన్సిలర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జేసీ చేసిన వ్యాఖ్యలపై మాధవీలత, బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి తీరును తప్పుపట్టారు. జేసీపై చర్యలు తీసుకోవాలంటూ సీఎం చంద్రబాబు నాయుడిని డిమాండ్ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే జేసీ ప్రభాకర్ రెడ్డి తాజాగా క్షమాపణలు చెప్పారు. కానీ మాధవీలత మాత్రం జేసీ క్షమాపణలపై సంతృప్తి చెందలేదు.