Pawan Kalyan: ‘పుష్ప-2’కి ఒక నీతి.. ‘గేమ్ ఛేంజర్’కి మరొక నీతి..! ఇదేనా పవన్ రాజనీతి..?
మొన్న ‘పుష్ప-2’.. ఇప్పుడు ‘గేమ్ ఛేంజర్’ ఏమీ మారలేదు. మితిమీరిన అభిమానమే ప్రాణాలు తీసింది. రాజమండ్రిలో జరిగిన ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి వెళ్లి తిరిగి వస్తూ ఇద్దరు మెగా అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. రంగంపేట మండలం కార్గిల్ ఫ్యాక్టరీ సమీపంలో ఐచర్ వ్యాన్ ఢీకొని కాకినాడకు చెందిన తోకడ చరణ్, ఆరవ మణికంఠగా మృతి చెందడం అందర్నీ కలచివేస్తోంది. సినిమాలను, హీరోలను అభిమానించడం తప్పు కాదు, కానీ సినిమాల కోసం, హీరోల కోసం ప్రాణాల మీదకి తెచ్చుకోవడం ఎంత వరకు కరెక్ట్ అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి.
పవన్‌ను అరెస్ట్ చేయాలా?
ఇక.. ‘పుష్ప-2’ ప్రీమియర్ షో తొక్కిసలాటలో రేవతి మృతి చెందడం, ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి వెళ్లి వస్తూ ఇద్దరు అభిమానులు మృతి చెందడం.. ఈ రెండు ఘటనల్లో తేడా ఏముంది..? ఏమీ లేదు.. రెండూ ప్రమాదాలే. రెండూ అనుకోకుండా జరిగిన ఘటనలే. అప్పుడు అల్లు అర్జున్‌ది పూర్తి బాధ్యత అయితే, మరి ఇప్పుడు ఎవరిది? రామ్ చరణ్‌ది, పవన్ కళ్యాణ్‌ది కాదా? రెండు ఘటనల్లోనూ ప్రాణాలు తీసింది కేవలం అభిమానమే కదా? అల్లు అర్జున్ రోడ్ షో చేయడం వల్లే తొక్కిసలాట జరిగిందన్నది నిజమైతే.. మరి యూత్ అంటే, ఫ్యాన్స్ అంటే.. చొక్కాలు చించుకోవాలని, బైక్ స్టంట్స్ చేస్తారని పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టుడు వ్యాఖ్యలతోనే ఈ ప్రమాదం జరిగిందనడం తప్పెలా అవుతుంది? అప్పుడు అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేయడం కరెక్ట్ అని అనిపిస్తే.. ఇప్పుడు పవన్‌ను అరెస్ట్ చేయాలని అనడం కూడా కరెక్టే అవుతుంది కదా!
ఇదేనా మానవీయ కోణం?
రేవతి మృతి విషయంలో అల్లు అర్జున్ తరుఫున మానవీయ కోణం లోపించిందన్న పవన్.. మెగా అభిమానులు మృతి చెందితే వారి ప్రాణానికి కేవలం రూ. 5 లక్షల ఖరీదు కట్టడం, పైగా రోడ్డు బాగాలేకనే ప్రమాదం జరిగిందంటూ గత ప్రభుత్వంపై నిందను తోయడం ఎలాంటి మానవీయ కోణమని సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. నిత్యం అదే రోడ్డులో ఎంతో మంది ప్రయాణిస్తున్నా.. వారికి జరిగని ప్రమాదం వీరికే ఎందుకు జరిగిందని, కేవలం పవన్ రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోస్టులు పెడుతున్నారు. ఒకవేళ రోడ్డు బాగా లేకపోవడమే కారణమైతే పంచాయతీరాజ్ శాఖకు కూడా మంత్రిగా ఉన్న పవన్ ఏడు నెలల నుంచి ఏం చేస్తున్నారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. అభిమాని మృతి చెందితే మరుసటి రోజే ఆ కుటుంబాన్ని పరామర్శించకపోవడాన్ని అల్లు అర్జున్ విషయంలో తప్పు పట్టిన పవన్.. మరి తానెందుకు వారి కుటుంబాలని కలిసి ఓదార్చడం లేదని, కనీసం రామ్ చరణ్ కూడా ఘటన జరిగిన మరునాడే ఆ కుటుంబాలను ఎందుకు పరామర్శించలేదని, ‘పుష్ప-2’కి ఒక నీతి, ‘గేమ్ ఛేంజర్’కి మరొక నీతి ఉంటుందా..? అని ప్రశ్నిస్తున్నారు.