Pawan Kalyan: పవన్.. ‘సీజ్ ది షిప్’పై అనుమానాలు?
రేషన్ బియ్యం అక్రమ రవాణా అంశం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సీజ్ ది షిప్.. అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టులో మొదలుపెట్టిన బియ్యం గొడవ ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. దీని వెనుక పెద్ద మాఫియానే ఉందన్న అనుమానాల నేపథ్యంలో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఇంతకీ.. ఆ బియ్యం ఎవరివి.. అని ఆరా తీస్తే.. మంత్రి వియ్యంకుడి పేరే బయటికొచ్చినట్లు వినిపిస్తోంది. దీంతో ఈ ఇష్యూలో కూటమి ప్రభుత్వం చర్యలపై ప్రతిపక్షాలు తీవ్ర అనుమానాలు రేకెత్తుతున్నాయి.
సీబీఐ దర్యాప్తు?
రేషన్ బియ్యం అక్రమ రవాణా అనేది ఎప్పట్నుంచో జరుగుతున్న సిండికేట్ వ్యవహారమని, ఇందులో లోకల్ టు గ్లోబల్ అనేక మంది చేతివాటం ఉందని ఆరోపణలొస్తున్నాయి. ఇదంతా మంత్రికి తెలిసే జరుగుతుందంటూ బాంబ్ పేల్చింది వైసీపీ. అలాగే పవన్ టూర్‌పై కొత్త కొత్త సందేహాల్ని వ్యక్తం చేస్తోంది వైసీపీ. స్టెల్లా షిప్పును జల్లెడపట్టారు సరే.. కెన్‌స్టార్ షిప్పును ఎందుకు వదిలిపెట్టారు? అనే లాజిక్‌తో ముందుకొచ్చారు మాజీ మంత్రి పేర్ని నాని. కెన్‌స్టార్ షిప్‌లో 42వేల టన్నుల బియ్యం ఉందంటూ బాంబ్ పేల్చారు. ఆర్థిక శాఖ మంత్రి వియ్యంకుడి షిప్పు కనుకనే దాన్ని ఉపేక్షించారంటూ ఆరోపిస్తున్నారు. ఏపీ కాంగ్రెస్ కూడా ఈ ఇష్యూపై విమర్శలు గుప్పిస్తోంది. రేషన్ బియ్యం తరలింపు వెనుక పెద్ద మాఫియా ఉందని ఆరోపిస్తోంది. ఇదొక జాతీయస్థాయి కుంభకోణమంటున్నారు షర్మిల. అవినీతి అధికారుల ప్రమేయం ఉందని, ఎవరికి దక్కాల్సిన వాటా వాళ్లకు చేరుతుండటంతో నిఘా వ్యవస్థ నిర్వీర్యమైపోయిందన్నారు. మొత్తం వ్యవహారంపై అవసరమైతే సీబీఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ ఇష్యూలో మున్ముందు ఇంకా ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో, ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయో వేచి చూడాలి.