Pawan Kalyan: పవన్‌కు ఊహించని షాక్.. వెంటాడుతున్న వాలంటీర్ల కేసు!
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడినా చెల్లుతుంది. ఎవర్నైనా తిట్టొచ్చు. ఎవరిపైనైనా ఎలాంటి ఆరోపణలైనా చేయొచ్చు అని కొంతమంది రాజకీయ నాయకులు భావిస్తూ ఉంటారు. కానీ ప్రతిపక్షంలో ఉండగా తాము చేసిన వ్యాఖ్యలే తమ మెడకు చుట్టుకుంటాయని ఎవరూ ఊహించరు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. వైసీపీ హయాంలో ప్రతిపక్ష నేతగా ఉన్న పవన్ కళ్యాణ్ చేసిన యాగీ అంతా ఇంతా కాదు. తోలు ఒలిచేస్తా.. తాట తీసేస్తా అంటూ ఆయన చేసిన విన్యాసాలు సినిమాల్నే మించిపోవడం చూశాం. ఇక, ఎన్నికల ప్రచారం సందర్భంగా ఏకంగా వాలంటీర్లపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వ్యాఖ్యలే ఆయనను వెంటాడుతున్నాయి.
ఉపసంహరణ చెల్లదా?
వాలంటీర్లు ఉమెన్ ట్రాఫికింగ్‌కు పాల్పడుతున్నారంటూ అప్పట్లో పవన్ చేసిన కామెంట్స్ రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. పవన్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా వాలంటీర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కూడా నిర్వహించారు. వాలంటీర్ల ఫిర్యాదు మేరకు పవన్‌పై కేసు కూడా నమోదు చేశారు. అయితే కూటమి సర్కార్ కొలువుదీరిన తర్వాత గుంటూరు కోర్టులో పవన్‌పై ఉన్న కేసును ఉపసంహరించుకున్నారు. కానీ కేసు ఉపసంహరణ చెల్లదంటూ ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ అంటున్నారు. వాలంటీర్లందరిపై తీవ్ర ఆరోపణలు చేసి, ఇప్పుడు ఎవరో ఒకరు ఉపసంహరించుకున్నంత మాత్రాన చెల్లదని ఆయన వాదిస్తున్నారు. ఈ మేరకు పవన్‌పై కేసు ఉపసంహరణను సవాల్ చేస్తూ ఆయన హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రజాప్రతినిధి అని, కాబట్టి ఆయన కేసు ఆ కోర్టులోనే పరిష్కరించాల్సి ఉంటుందని జడ శ్రవణ్ వాదిస్తున్నారు. గుంటూరు కోర్టు నుంచి ప్రజాప్రతినిధుల కోర్టుకు పవన్ కేసును బదిలీ చేసుకోవాల్సి ఉంటుందని, అవసరమైతే దీనిపై న్యాయపోరాటానికి సైతం దిగుతానని అంటున్నారు.