Pawan Kalyan: అసలు పవన్ కళ్యాణ్‌కు ఏమైంది? జనసేన శ్రేణుల్ని కమ్మేస్తున్న నైరాశ్యం!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీకి సీఎం కావాలని ఆ పార్టీ శ్రేణులు, ఆయన అభిమానులందరి కల. కానీ ఆ కల ఇక కలగానే మిగిలిపోనుందా? అసలు పవన్‌కు పార్టీని బలోపేతం చేసే ఉద్దేశమే లేదా? తన రాజకీయ జీవితమంతా చంద్రబాబుకు పట్టాభిషేకం కోసం పాకులాడటమే పవన్ ఏకైక లక్ష్యమా? ఎన్నికల్లో వంద శాతం స్ట్రైక్ రేట్‌తో తనను గెలిపించిన పార్టీ శ్రేణులకు నిరాశ తప్పదా? అవును మరి.. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే ఈ ప్రశ్నలన్నిటికీ అవునన్న సమాధానం మాత్రమే వస్తుంది.
చంద్రబాబే మరో పదేళ్లు ఉండాలి!
ఇటీవలి అంసెబ్లీ సమావేశంలో జనసేనాని పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రం ప్రగతి పథంలో పయనిస్తోందని, ఇదే స్ఫూర్తితో చంద్రబాబు పనిచేస్తూ తమకు జస్ట్ ఆదేశాలు ఇస్తే చాలని, ఆయన ఆదేశాలను తు.చ. తప్పక పాటిస్తామని అన్నారు. అంతేకాదు, పనిలో పనిగా ఇంకో మాట కూడా అన్నారు. చంద్రబాబే ఏపీకి మరో పదేళ్ల పాటు సీఎంగా ఉండాలని ఆయన బలంగా కోరుకుంటున్నారట. సరే.. ఇంత దాకా బాగానే ఉన్నా.. పవన్ మాట్లాడిన మాటలు ఆయన సొంత పార్టీ నేతల్లోనే అసంతృప్తికి కారణమవుతున్నాయట.
కేవలం వారికి కుర్చీ కోసమే పవన్ పాకులాట?
అసలు ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికైనా, చంద్రబాబు మరోసారి సీఎం కుర్చీలో కూర్చోవడానికైనా కారణం కేవలం పవన్ కళ్యాణేనన్న విషయం అందరికీ తెలిసిందే. గత ఎన్నికల్లో కేవలం ఒక్క సీటుకే పరిమితమైన పార్టీని 21 స్థానాల్లో పోటీ చేయించి వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించిన సత్తా ఆయనది. కానీ కూటమితో జత కట్టి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక పవన్ కళ్యాణ్‌కు సొంత పార్టీపై శ్రద్ధే లేకుండా పోయింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా సరే.. తన సొంత పార్టీని బలోపేతం చేసుకోవడంపై దృష్టిపెట్టాలి. కానీ పవన్ ఏం చేస్తున్నారు? చంద్రబాబు భజన చేస్తున్నారు. అధికారంలోకి వచ్చింది మొదలు పవన్ తన పార్టీ బలోపేతానికి తీసుకున్న ఒక్క చర్య కూడా లేదు. కనీసం జిల్లా ఇంఛార్జీలను, నియోజక వర్గ ఇంఛార్జీలను, మండల స్థాయి కమిటీలను కూడా నియమించలేదు. పైగా మాట మాట్లాడితే చంద్రబాబే గొప్ప అని, ఆయన పార్టీనే గ్రేట్ అని పొగిడేస్తున్నారు. అసలు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో వచ్చింది.. తను సీఎం కావాలనా? లేక చంద్రబాబును.. ఆ తర్వాత లోకేశ్ బాబును.. ఇలా నారా వారి కుటుంబాన్ని సీఎం కుర్చీలో కూర్చోబెట్టడానికా? అని జనసేనలోనే కొందరు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారట.
సీఎం కావాలన్నా కసి ఏది?
అయినా సీఎం కావాలని ఇటు జగన్మోహన్ రెడ్డికైనా, అటు చంద్రబాబుకైనా ఉన్న కసి పవన్ కళ్యాణ్‌లో ఎక్కడా కనిపించట్లేదు. మరి ఇలా అయితే జనసేన పార్టీ రాష్ట్రంలో బలోపేతం అయ్యేదెప్పుడు? పవన్ సీఎం అయ్యేదెప్పుడు.. ఇక ఆయననే నమ్ముకున్న ఆ పార్టీ కార్యకర్తలు, నాయకుల భవిష్యత్తు ఏమిటి? వంద శాతం స్ట్రైక్ రేటుతో ఆయనను గెలిపించిన పార్టీ కార్యకర్తల పరిస్థితేంటి? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాష్ట్రంలో ఒక బలమైన పార్టీగా ఎదిగే ఛాన్స్ జనసేనకు ఉంది. అంతేకాదు, పవన్ తలచుకుంటే టీడీపీ కన్నా ఒక బలమైన శక్తిగా ఎదగొచ్చు. గట్టిగా ప్రయత్నిస్తే ఇప్పుడు కాకపోతే ఇంకో 15 సంవత్సరాలకైనా పవన్ సీఎం కావొచ్చు. కానీ ఏం లాభం? ఈ అధికార దాహం అధినేతల వారికి ఉండాలి కదా? అని జనసేన శ్రేణులు మాట్లాడుకుంటున్నాయట.