Rajya Sabha Elections: అన్నయ్యకు బంపర్ ఆఫర్ ఇవ్వనున్న పవన్.. ఏపీలో హీట్ పుట్టిస్తున్న రాజ్యసభ ఉపఎన్నికల నోటిఫికేషన్!
ఆంధ్రప్రదేశ్ కూటమి నేతల్లో రాజ్యసభ రేస్ మొదలైపోయింది. ముగ్గురు వైసీపీ రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు, మోపిదేవి వెంకట రమణ, ఆర్ క్రిష్ణయ్య రాజీనామాలు చేయడంతో ఈ సీట్లకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ వెల్లడించింది. ఈ మూడు స్థానాల్లో డిసెంబర్‌లో ఉపఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఏపీలో పెద్దల సభకు సంబంధించిన రాజకీయ హడావుడి మొదలైపోయింది. కూటమిలోని మూడు పార్టీల ఆశావహులంతా ఇప్పటికే తమ అధినేతలను కలుస్తూ సీటు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, మూడు స్థానాల్లో ఒకటి టీడీపీకి దాదాపు ఖరారైనట్టు చెబుతున్నారు. మిగతా రెండు సీట్లలో ఒకటి జనసేనకు ఇచ్చే అవకాశం ఉందని.. మూడో స్థానం కోసం టీడీపీ, బీజేపీ మధ్యే పోటీ ఉందని అంటున్నారు. ఇక.. టీడీపీ నుంచి ఇటీవల పార్టీలో చేరిన బీద మస్తాన్‌రావు, సానా సతీష్, కంభంపాటి రామ్మోహన్‌రావు, గల్లా జయదేవ్ పోటీ పడుతున్నట్టు సమాచారం. అలాగే, జనసేన నుంచి నాగబాబు, బీజేపీ నుంచి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి రేస్‌లో ఉన్నట్టు చెబుతున్నారు.
నాగబాబుకు ఫిక్స్!
మిగితా రెండు స్థానాల సంగతి ఎలా ఉన్నా మూడింట్లో ఒకటి మాత్రం జనసేనకు, అది కూడా పవన్ సోదరుడు నాగబాబుకు ఫిక్స్ అయిపోయినట్లు తెలుస్తోంది. అనకాపల్లి లోక్‌సభకు పోటీ చేయడానికి అన్నీ సిద్ధం చేసుకుని పొత్తులో భాగంగా చివరి నిమిషంలో తప్పుకున్న నాగబాబును ఎలాగైనా రాజ్యసభకు పంపించాలని పవన్ డిసైడ్ అయిపోయారట. నాగబాబుని జాతీయ రాజకీయాల్లోకి పంపించాలని పవన్ కళ్యాణ్ ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నారు. 2019లోనే జనసేన నుంచి నర్సాపురం లోక్‌సభకు పోటీ చేయించారు. ఆ ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేసినా నాగబాబుకు రెండున్నర లక్షల ఓట్ల దాకా వచ్చాయి. ఇక ఈసారి కూటమి తరఫున పోటీ చేసి ఉంటే ఆయన అనకాపల్లి నుంచి ఎంపీ అయ్యేవారని అంతా చెబుతారు. అది కూడా బీజేపీతో పొత్తు కారణంగా నాగబాబు వదులుకోవాల్సి వచ్చింది. దాంతో ఇపుడు రాజ్యసభ ఉపఎన్నికలు అనుకోని అవకాశంగా వచ్చాయి. కాబట్టి ఈసారి ఎలాగైనా తన అన్నను పార్లమెంట్‌లో కూర్చోబెట్టాలని పవన్ నిర్ణయించుకున్నారట.