RGV: పోలీసు విచారణకు రామ్ గోపాల్ వర్మ నో! సమయం కావాలంటూ వాట్సప్ మెసేజ్..!
డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఏపీ పోలీసుల విచారణకు గైర్హాజరయ్యారు. పోలీసుల విచారణకు హాజరయ్యేందుకు తనకు నాలుగు రోజుల సమయం కావాలని కోరారు. ఈ మేరకు వాట్సాప్ ద్వారా ప్రకాశం జిల్లా పోలీసులకు సమాచారం ఇచ్చారు. ‘వ్యూహం’ సినిమా సమయంలో చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, లోకేష్, తదితరులపై అసభ్యకర పోస్టులు పెట్టారని ఆర్జీవీపై టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి ముత్తనపల్లి రామలింగయ్య ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు చేసిన పోలీసులు నవంబర్ 19న విచారణ అధికారి ఎదుట హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్‌కు వెళ్లి ఆర్జీవీకి నోటీసులు అందించారు.
కోర్టులో చుక్కెదురు
మరోవైపు ఈ కేసులో అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలంటూ ఆర్జీవీ హైకోర్టును ఆశ్రయించగా ఆయనకు చుక్కెదురైంది. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించలేమని స్పష్టం చేసింది. అరెస్ట్ భయం ఉంటే బెయిల్ పిటిషన్ వేయాలని.. క్వాష్ పిటిషన్‌లో బెయిల్‌కు సమానమైన ఉపశమనం కోరలేమని జస్టిస్ బీవీఎల్‌ఎన్ చక్రవర్తి అన్నారు. ఏదైనా ఉంటే బెయిల్ పిటిషన్ వేసుకోవాలని సూచించింది. అధికారులు నోటీసులు జారీ చేస్తే విచారణ అధికారి ఎదుట హాజరుకావాలని చెప్పారు. అయితే ఆర్జీవీ మాత్రం ఇవాళ విచారణకు హాజరు కాలేదు.