Tirumala: ఏపీలో తిరుమల లడ్డూ వివాదం.. చివరికి ఇందులోనూ రాజకీయమేనా?
శ్రీశ్రీ గారు.. ‘కాదేదీ కవితకు అనర్హం’ అన్నట్లు.. ఏపీలో కాదేదీ రాజకీయాలకు అనర్హం అన్న విధంగా పరిస్థితులు మారిపోయాయి. రాష్ట్రంలో అధికార కూటమి, ప్రతిపక్ష వైసీపీ మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది. చివరకు వీరి రాజకీయాల్లోకి తిరుమల శ్రీవారి లడ్డూను సైతం తీసుకొచ్చారు. గత ప్రభుత్వంలో తిరుమల లడ్డూను జంతువుల నూనెతో తయారు చేశారంటూ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగానూ సంచలనం రేపుతున్నాయి. టీటీడీ లడ్డూల తయారీలో ఎద్దు కొవ్వు, చేప నూనె వాడినట్లు పరీక్షల్లోనూ నిర్ధారణ అయ్యిందని రిపబ్లిక్ టీవీ తాజాగా వెల్లడించింది.
చంద్రబాబు వ్యాఖ్యల్ని ఖండించిన వైసీపీ
అయితే, చంద్రబాబు వ్యాఖ్యల్ని, రిపబ్లిక్ టీవీ కథనాన్ని, గత ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ తయారీపై వస్తున్న ఆరోపణల్ని వైసీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తీవ్రంగా ఖండించారు. అలాంటి ఘటనలు జరిగి ఉంటే తాము కుటుంబ సభ్యుల మొత్తం ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నామని, చంద్రబాబు సిద్ధంగా ఉన్నారా? అంటూ ప్రశ్నించారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే చంద్రబాబు తిరుమల లడ్డూపై విషప్రచారానికి దిగారంటూ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. తమ హయాంలో ఏం జరిగిందన్న దానిపై అవసరమైతే విచారణ జరిపించుకోవచ్చని, అధికారంలో ఉంది మీరే కదా? అంటూ ప్రశ్నించారు. నిజానికి తిరుమల లడ్డూ తయారీలో జంతువుల నూనెను వాడుతుంటే దాని తయారుదారులు ఏం చేస్తున్నారన్న ప్రశ్న తలెత్తుతుంది. లడ్డూలను తయారు చేసేది తిరుమలలోనే. అందుకు కూడా అత్యాధునికమైన వంట శాలను కూడా ఏర్పాటు చేశారు. నేతిని కాకుండా జంతువుల నూనెను అందులో వేస్తే తయారీదారులు ఎందుకు ఊరుకుంటారన్న ప్రశ్న వైసీపీ నేతల నుంచి వస్తోంది.
హిందువుల మనోభావాలు దెబ్బతీయెద్దు!
మరోవైపు హిందూ మనోభావాలు దెబ్బతీసేవిధంగా, తిరుమల ప్రతిష్టను దిగజార్చేలా వైసీపీ, టీడీపీ ప్రయత్నిస్తున్నాయంటూ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. ఆరోపణల్లో రాజకీయ కోణం లేకుంటే సీబీఐ విచారణకు ఆదేశించాలని చంద్రబాబుకు షర్మిల సవాల్ విసిరారు. ఒకరి మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రయత్నించవద్దంటూ రెండు పార్టీలకూ షర్మిల హితవు పలికారు. తిరుమల లడ్డూపై చంద్రబాబు చేసిన ఆరోపణలపై నిజానిజాలను నిగ్గు తేల్చాలని షర్మిల డిమాండ్ చేశారు.