Tirupati Gangamma Jatara: పుష్ప-2లో పూనకాలు తెప్పించిన తిరుపతి గంగమ్మ జాతర కథ తెలుసా?
సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వినిపిస్తున్న ఒకే ఒక్క పేరు పుష్ప.. పుష్ప.. పుష్ప..! ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అంటూ ప్రపంచ వ్యాప్తంగా నిన్న రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేస్తోంది. విడుదలైన రోజే ఏకంగా రూ. 175 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి రికార్డు సృష్టించింది. ఇక, ఈ మూవీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన నటవిశ్వరూపం ప్రదర్శించారు. ముఖ్యంగా పుష్ప-2లోని గంగమ్మ జాతర సీన్ మూవీకే హైలెట్. మాతంగి వస్త్రధారణలో 20 నిమిషాలపాటు థియేటర్లలో పూనకాలు పుట్టించాడు పుష్పరాజ్. అర్ధనారీశ్వరతత్వానికి అద్దం పట్టేలా కాళ్లకు గజ్జెలు, కళ్లకు కాటుక పెట్టుకుని, చీరకట్టులో ఒంటినిండా నగలు ధరించి తీక్షణమైన చూపులతో, మెడలో నిమ్మకాయల దండతో తాండవం చేసే అల్లు అర్జున్ నటనను చూసి ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. మరి ఇంతకీ ఈ గంగమ్మ జాతర కథ గురించి, ఎప్పుడు, ఎక్కడ జరుగుతుందో మీకు తెలుసా?
900 ఏళ్ల నాటి కథ!
తిరుపతికి రెండు కిలోమీటర్ల దూరంలో తాతయ్యగుంట ప్రాంతంలోని గంగమ్మ ఆలయంలో అమ్మవారికి నిర్వహించే ఈ జాతర చాలా ప్రత్యేకం. ఏటా మే నెలలో ఈ జాతర జరుగుతుంది. సాక్షాత్తూ తిరుమల వేంకటేశ్వరుడు తన సోదరి గంగమ్మకు సారె పంపడం తరతరాలుగా వస్తున్న ఆచారం. అంతేకాదు దీనిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండుగగా కూడా గుర్తించారు. ఈ జాతర వెనుక చారిత్రక, పౌరాణిక గాథలున్నాయి. దాదాపు 900 ఏళ్ల క్రితం రాయలసీమ అంతటా పాలెగాళ్ల హవా నడిచింది. వాళ్లలో చిత్తూరు పాలెగాడు మహా దుర్మార్గుడు. ఏ అమ్మాయిని వదలని కామాంధుడు. తన ఇలాఖాలో యుక్తవయసుకు వచ్చిన ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడేవాడు. కొత్తగా పెళ్లైన వధువులంతా మొదటిరాత్రి తనతో గడపాలని ఆంక్షలు విధించేవాడని చెబుతారు. వాడిని అంతం చేయడానికి సాక్షాత్తూ అమ్మవారే గంగమ్మగా అవతరించిందని నమ్ముతారు.
ఏడు రోజుల జాతర
యుక్తవయసుకు వచ్చిన గంగమ్మపై కన్నేసిన పాలెగాడిపై.. ఆ తల్లి విశ్వరూపం ప్రదర్శిస్తుంది. ఆమెకు భయపడి పాలెగాడు పారిపోయి ఓ చెట్టు తొర్రలో దాక్కుంటాడు. ఆ దుష్టుడ్ని వెతుకుతూ.. మొదటి రోజు బైరాగి వేషం, రెండో రోజు బండ వేషం, మూడో రోజు తోటి వేషాలు వేసిందట గంగమ్మ. మూడు వేషాలు వేసినా పాలెగాడు కనిపించకపోవడంతో, నాలుగోరోజు దొరవేషం వేసింది గంగమ్మ. దొరవేషం వేయగానే, తన ప్రభువైన దొర వచ్చాడనుకున్న పాలెగాడు.. బయటకు వచ్చాడట. వెంటనే అతడిని చంపిన గంగమ్మ.. దుష్టశిక్షణ చేసిందని భక్తులు చెబుతుంటారు. మహిళల మానప్రాణాలు హరించిన ఆ పాలెగాడిని రుద్రరూప ఆదిశక్తి రూపంలో అమ్మవారు అంతం చేసినందుకు కృతజ్ఞతగా అక్కడి ప్రజలు ఏటా వారం రోజులపాటు గంగమ్మ జాతర నిర్వహిస్తారు. రకరకాల వేషాల్లో ఊరంతా తిరుగుతూ నృత్యాలు చేస్తారు. తమ కోరికలు నెరవేరిన భక్తులు మాతంగి వేషంలో గంగమ్మ ఆలయానికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. అంతేకాదు, గంగమ్మ జాతర పూర్తయ్యే వరకు ఊరి పొలిమేరలు దాటకూడదనే సంప్రదాయం తిరుపతిలో ఇప్పటికీ ఉందట.