తెలుగు
te తెలుగు en English
Linkin Bioఆంధ్రప్రదేశ్
Trending

Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట.. టీటీడీ, పోలీసుల నిర్లక్ష్యమే కారణమా?

తిరుపతి తొక్కిసలాట ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. వైకుంఠ ద్వారదర్శన టోకెన్ల కోసం ఏర్పాటు చేసిన క్యూలైన్లలో భక్తులు పోటెత్తడంతో తీవ్ర స్థాయిలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు మృతి చెందారు. మరో 44 మందికిపైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారిని రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు, ఈ ఘటన నేపథ్యంలో ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తుల కుటుంబ సభ్యులు భయాందోళనకు గురవుతున్నారు. తమ వారి క్షేమ సమాచారం కోసం ఫోన్లలో ఆరా తీస్తున్నారు.

అసలేం జరిగింది?

తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం 10వ (శుక్రవారం) తేదీ నుంచి 19వ తేదీ వరకూ పది రోజుల పాటు జరగనున్న సంగతి తెలిసిందే. శుక్రవారం నాటి దర్శనం కోసం గురువారం తెల్లవారుజామున 5 గంటలకు టోకెన్లు జారీ చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. దీని కోసం తిరుపతిలో ఎనిమిది ప్రాంతాల్లో 94 టోకెన్‌ జారీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దీంతో, దేశంలోని పలు రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు బుధవారం ఉదయం నుంచే వేచి ఉన్నారు. బైరాగిపట్టెడ వద్ద ఏర్పాటు చేసిన కేంద్రంలో సిబ్బంది ఒకరు అస్వస్థతకు గురికావడంతో ఆయనను ఆస్పత్రికి తరలించేందుకు క్యూ లైన్‌ను తెరిచినట్లు చెబుతున్నారు. టోకెన్లు జారీ చేసేందుకు క్యూలైన్లు తెరిచారని భావించిన భక్తులు ఒక్కసారిగా తోసుకురావడంతో తొక్కిసలాట జరిగినట్లు చెబుతున్నారు. అయితే, విష్ణువాసంలో తొక్కిసలాటకు కారణాలు మాత్రం తెలియరాలేదు.

అసమర్థత వల్లేనా..?

టీటీడీ చ‌రిత్ర‌లోనే తొక్కిస‌లాట‌ ఘటనలు ఎప్పుడూ జరగలేవు. అలాంటిది ఇప్పుడు ఏకంగా ఆరుగురు భ‌క్తులు ప్రాణాలు కోల్పోవ‌డం, 44 మంది భక్తులు గాయాలపాలవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీనికి పూర్తిగా టీటీడీ పాల‌క మండ‌లి, పోలీసుల అస‌మ‌ర్థ‌తే కార‌ణ‌మని భక్తులు విమర్శిస్తున్నారు. టీటీడీ యాజమాన్యం, పోలీసుల నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట జరిగిందని ఆరోపిస్తున్నారు. క్యూలైన్ల వద్ద సరైన భద్రతా ఏర్పాట్లు లేవని, ఎలాంటి ఏర్పాట్లు లేకుండానే 1.20 లక్షల మంది భక్తులకు టోకెన్లు ఇస్తామని టీటీడీ ఛైర్మన్ ప్రకటించడం పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అంతేకాదు, టిక్కెట్ల జారీపై నిర్దిష్ట ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని అంటున్నారు. మరోవైపు ఈ తొక్కిసలాట ఘటనపై అధికారులు సీఎంకు అందించిన నివేదికలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. డీఎస్పీ అత్యుత్సాహం వల్ల భక్తులు ఒక్కసారిగా రావడంతో తొక్కిసలాట జరిగినట్లు అధికారులు నివేదించారు.

టీటీడీ ఛైర్మన్ బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు!

మరోవైపు, తొక్కిసలాట ఘటనపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పందించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తొక్కిస‌లాట ఘ‌ట‌న దుర‌దృష్ట‌క‌రమన్న ఆయన.. చింతించ‌డం త‌ప్ప మ‌నం చేసేదేమీ లేద‌న‌డం, అలాగే ఎవ‌రినీ నిందించ‌లేమ‌ని పేర్కొనడంపై భక్తులు మండిపడుతున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలా నిర్లక్ష్యపూరితంగా మాట్లాడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button