తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

Union Budget 2024-25: బిహార్‌కు నిధుల వరద.. ఏపీకి అప్పుల బురద..!

కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో ప్రధాన మిత్రపక్షంగా ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు చాకచక్యంతో కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రాష్ట్రానికి నిధుల పారిస్తారని ఇక్కడి ఎన్డీయే కూటమి నేతలు తెగ ప్రచారం చేశారు. కానీ అదంతా కేవలం ప్రచారం ఆర్భాటంగా మాత్రమే మిగిలిపోయింది. కేంద్ర బడ్జెట్‌ ద్వారా రాష్ట్రానికి ప్రత్యేకంగా కేటాయింపులు చేయించడంలో చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారు. ఏపీ రాజధాని నిర్మాణానికి రూ.15 వేల కోట్ల సాయం అందిస్తామని, అవసరాన్ని బట్టి మరిన్ని నిధులు ఇస్తామని నిర్మలా సీతారామన్ చెప్పగానే కొంత పొంగిపోయినా.. కానీ అవి వివిధ ఏజెన్సీల ద్వారా అప్పుల రూపేణా అని ఒక విడ్డూరమైన ప్రకటన చేయగానే అందరూ షాక్ తిన్నారు. అంతేకాదు, పోలవరం గురించి కూడా స్పష్టమైన హామీ కరువైంది. వైజాగ్ మెట్రో గురించి అయితే బడ్జెట్లో ఊసే లేదు. కానీ అదే సమయంలో ఎన్డీయేలో మరో ప్రధాన మిత్రపక్షం బిహార్‌లోని జేడీయూ మాత్రం ఆ రాష్ట్రానికి భారీగా నిధులు రాబట్టుకుంది. ఒక్క హైవేల నిర్మాణానికే ఆ రాష్ట్రానికి ఏకంగా రూ. 26 వేల కోట్లు కేటాయించారు. రూ. 22 వేల కోట్లతో మెగా పవర్ ప్లాంట్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాదు, ఆ రాష్ట్రంలో రహదారుల నిర్మాణం, కొత్త విమానాశ్రయాలు, కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం, రైల్వే జోన్ కి కేంద్ర గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బిహార్‌కు ఒక న్యాయం ఆంధ్రప్రదేశ్‌కు మరో న్యాయం అనే రీతిలో కేంద్ర బడ్జెట్‌ ఉందని పలువురు విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

అంతేకాదు, కేంద్ర బడ్జెట్‌ను నిశితంగా పరిశీలిస్తే ఏపీకి ప్రత్యేక ఆర్థిక మద్దతు అని పేర్కొన్నారు తప్ప ఎక్కడా గ్రాంటు, ఆర్థికసాయం అని చెప్పలేదు. ఈ నేపథ్యంలో ఏపీకి అప్పులు ఇప్పించడానికి మాత్రమే కేంద్రం ముందుకు వచ్చిందని, ఇదే విషయాన్ని బడ్జెట్‌ ప్రసంగంలో ప్రకటించి చేతులు దులుపుకొన్నారని, దీనివల్ల రాష్ట్రానికి అప్పులు తప్ప పెద్దగా ప్రయోజనం లేదని స్పష్టమవుతోంది. వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లా అభివృద్ధికి సాయం కొనసాగుతుందని బడ్జెట్‌ ప్రసంగంలో చెప్పారు తప్ప ఎక్కడా కేటాయింపులు చేయలేదు. ఇక గిరిజన యూనివర్సిటీకి, సెంట్రల్‌ యూనివర్సిటీకి బడ్జెట్‌లో ఏమీ ఇవ్వలేదు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న పెట్రోలియం యూనివర్సిటీకి మాత్రం రూ.168 కోట్లు కేటాయించారు. పునర్విభజన చట్టంలోని పలు వైద్య, విద్యాసంస్ధలకు బడ్జెట్‌లో ఎటువంటి కేటాయింపులు చేయలేదు. మొత్తానికి కేంద్రం నుంచి బిహార్ సీఎం ఎంతో చాకచక్యంగా భారీగా నిధులు రాబడితే, ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం ఫ్లాప్ అయ్యారు.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button