తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

YCP: నేడు బాపట్ల జిల్లాలో వైసీపీ చివరి ‘సిద్ధం’ సభ

బాపట్ల జిల్లా మేదరమెట్ల సమీపం పి.గుడిపాడులో జరగనున్న నాలుగో (చివరి) సిద్ధం సభను వైసీపీ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ సభ ద్వారా వైసీపీ శ్రేణులకు సీఎం జగన్‌ దిశానిర్దేశం చేయనున్నారు. తమ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను జగన్మోహన్ రెడ్డి ప్రజలకు వివరిస్తారని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఈ సభను చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించాలని నాయకులు భావిస్తున్నారు. చివరి సభకు ఏకంగా 15 లక్షల మందిని తరలించి సత్తా చాటాలని ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ సభకు పల్నాడు, గుంటూరు, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు జిల్లాల నుంచి పెద్దఎత్తున పార్టీ కార్యకర్తలు, అభిమానులతో పాటు సామాన్య ప్రజలు భారీ సంఖ్యలో హాజరుకానున్నారు. దక్షిణ కోస్తాలోని నియోజకవర్గాల కేంద్రంగా ఈ సభ జరగనుంది. ఈ సభ తర్వాత జగన్మోహన్ రెడ్డి నేరుగా ఎన్నికల ప్రచారంలోకి దూకనున్నారు.

ALSO READ:  11వ జాబితా విడుదల చేసిన వైసీపీ

మూడు సభలు గ్రాండ్ సక్సెస్..

ఎన్నికల రణరంగానికి జనవరి 27న భీమిలి వేదికగా జగన్మోహన్ రెడ్డి సమరశంఖం పూరించారు. ఓ వైపు జనబలమే గీటురాయిగా, సామాజిక న్యాయమే పరమావధిగా అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు సమన్వయకర్తల నియామకంపై కసరత్తు చేస్తూనే.. మరోవైపు ‘సిద్ధం’ సభలు నిర్వహిస్తూ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఉత్తరాంధ్ర, ఉత్తర కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో నిర్వహించిన ‘సిద్ధం’ సభలు సూపర్ సక్సెస్‌ కావడంతో పార్టీ శ్రేణులు ప్రజాక్షేత్రంలో దూసుకెళ్తున్నాయి. వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన ద్వారా సీఎం జగన్‌ తెచ్చిన విప్లవాత్మక మార్పులను ప్రతి ఇంటా గుర్తుచేస్తూ.. ప్రభుత్వం వల్ల మంచి జరిగి ఉంటే.. మరింతగా మంచి చేయడానికి వైఎస్సార్‌సీపీని ఆశీర్వదించి, ఓటు వేయాలని శ్రేణులు ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేస్తున్నారు. వీరికి ప్రజలు సైతం నీరాజనాలు పలుకుతున్నారు.

ALSO READ: కాంట్రాక్ట్ ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపిన జగన్

జగన్ ప్రసంగంపై తీవ్ర ఉత్కంఠ

ఇప్పటివరకు జరిగిన సభలు ఒకెత్తు..ఇవాళ మేదరమెట్ల సభ మరో ఎత్తు అంటోంది వైసీపీ. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ ప్రసంగంపైతీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పటి వరకు వైసీపీ పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించడంతో పాటు వచ్చే ఐదేళ్లలో చేయబోయే అభివృద్ధి పనులు, రెండోసారి అధికారంలోకి వచ్చాక తీసుకువచ్చే సంక్షేమ పథకాలను సీఎం వివరించనున్నట్లు చెబుతున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య పొత్తు కుదిరిన నేపథ్యంలో మూడు పార్టీల కూటమిపై జగన్ బాణాలను ఎక్కుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ సభలోనే మేనిఫెస్టోను సైతం విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

సీఎం జగన్ ‘సిద్ధం’ సభ షెడ్యూల్..

  • మధ్యాహ్నం 2.55 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి సీఎం జగన్ హెలికాఫ్టర్ ద్వారా బయల్దేరతారు.
  • 3.25 గంటలకు హెలిప్యాడ్ దగ్గరకు చేరుకుంటారు.
  • 3.35 గంటలకు సిద్ధం సభా వేదిక వద్దకు చేరుకుంటారు.
  • 3.40 నుండి 5.10 గంటల వరకు సిద్ధం సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు.
  • 5.30 సభా పూర్తయిన అనంతరం సభాస్థలి నుంచి బయలుదేరి 6.00 గంటలకు తాడేపల్లిలోని తన నివాసానికి తిరిగి చేరుకుంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button