YS Jagan: లడ్డూ వివాదాన్ని పక్కదారి పట్టించేందుకే డిక్లరేషన్ వివాదం.. జగన్ కీలక వ్యాఖ్యలు!
తిరుమల లడ్డూ వివాదం చిలికి చిలికి గానివానలా మారుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర మాటల యుద్ధానికి కారణమవుతోంది. ఈ క్రమంలోనే తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి ఆరోపణల నేపథ్యంలో.. శ్రీవారి దర్శనానికి వెళ్తున్నట్లు వైఎస్ జగన్ నిన్న ప్రకటించారు. అందులో భాగంగా ఇవాళ రాత్రికి తిరుమల చేరుకుని.. శనివారం ఉదయం వైఎస్ జగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నట్లు వైసీపీ ఇటీవల తెలిపింది. ఈ మేరకు షెడ్యూల్ కూడా విడుదలైంది. అయితే వైఎస్ జగన్ తిరుమల పర్యటన అనూహ్యంగా రద్దైంది.
దేవుడి దర్శనానికి వెళ్తే అడ్డంకులా?
ఈ విషయమై వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి కూటమి ప్రభుత్వం మీద, చంద్రబాబు మీద ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘ఇలాంటి పరిస్థితి రాజకీయ జీవితంలో చూడలేదు. దేవుడి దర్శనానికి వెళ్తుంటే అడ్డుకునే ప్రయత్నం చేయడం దారుణం. నా తిరుమల పర్యటనకు అనుమతి లేదని వైసీపీ వాళ్లకు నోటీసులు ఇచ్చారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలు. జరగని విషయాన్ని జరిగినట్లు కల్తీ నెయ్యి అంటూ అబద్ధాలు చెప్తున్నారు. తిరుపతి లడ్డూ అంశాన్ని పక్కదారి పట్టించేందుకు డిక్లరేషన్ అంశాన్ని తీసుకు వచ్చారు. కూటమి వందరోజుల పాలనా వైఫల్యాలను డైవర్ట్ చేయడానికే తిరుపతి లడ్డూ వ్యవహారం తెరపైకి తెచ్చారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రే దగ్గరుండి తిరుమలను అపవిత్రం చేయిస్తున్నారు. టీటీడీలో నెయ్యి కొనుగోలు ప్రక్రియ దశాబ్దాలుగా జరుగుతోంది. దాన్నేమీ మేము మార్చలేదు. టీటీడీలో తప్పు చేయాలన్నా తప్పులేని వ్యవస్థ ఉంది. ఏ నిర్ణయమైనా సభ్యులు అందరూ కలిసి తీసుకుంటారు.’ అని వైఎస్ జగన్ చెప్పారు.
రాజకీయ లబ్ధి కోసమే లడ్డూ వివాదం!
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడలేదని సెప్టెంబర్ 22న టీటీడీ ఈవో రిపోర్టు కూడా ఇచ్చినట్లు జగన్ తెలిపారు. అయితే ఇంత తెలిసినా కూడా చంద్రబాబు తిరుమల లడ్డూపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని వైఎస్ జగన్ ఆరోపించారు. టీటీడీ ఈవో రిపోర్టు తర్వాత కూడా చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం ఆ నెయ్యిని వాడేశారంటూ తిరుమల పవిత్రతను తగ్గించేలా అబద్ధాలు చెప్తున్నారని జగన్ విమర్శించారు. లడ్డూ పవిత్రతను దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారన్నారు.
మానవత్వమే నా మతం!
‘మా నాన్న వైఎస్ఆర్ ఐదుసార్లు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆయన కొడుకునే కదా. పాదయాత్రకు ముందు శ్రీవారి దర్శనం చేసుకున్నా. పాదయాత్ర పూర్తయ్యాక.. కాలినడకన తిరుమల కొండెక్కి వెంకన్న దర్శనం చేసుకున్నా. ఇవన్నీ రాష్ట్ర ప్రజలకు తెలియవా? చంద్రబాబుకు తెలియవా? ఆ తర్వాతే ముఖ్యమంత్రిని అయ్యా. సీఎం హోదాలో ఐదుసార్లు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించా. నేను తిరుమల వెళ్లడం ఇదే తొలిసారి కాదు. పది, పన్నెండుసార్లు తిరుమలకు వెళ్లినవాడికి నోటీసులు ఇస్తారా?. ఈ రోజు నేను తిరుమలకు రాకూడదట, కారణం నా మతమట. నా మతం, కులం ఏంటో ప్రజలకు తెలియదా?. నాలుగు గోడల మధ్య నేను బైబిల్ చదువుతా. బయటకు వెళ్తే హిందూ, ఇస్లాం, సిక్కు మతాలను గౌరవిస్తా. నా మతం మానవత్వం. కావాలంటే డిక్లరేషన్‌లో రాసుకోండి..’ అంటూ జగన్ ఎమోషనల్ అయ్యారు.