తెలుగు
te తెలుగు en English
Linkin Bioఆంధ్రప్రదేశ్

YS Sharmila: ముఖం చాటేస్తున్న కాంగ్రెస్.. షర్మిలకు సొంత పార్టీ మద్దతు ఏది?

సరస్వతీ పవర్ కంపెనీలో షేర్ల వ్యవహారంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి, ఆయన సోదరి, రాజకీయ ప్రత్యర్థి వైఎస్ షర్మిలకు మధ్య వివాదం నడుస్తోంది. రాజకీయంగా తనతో విభేదించినందువలన, తనపై వ్యక్తిగత ఆరోపణలతో పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్నందువలన తన తల్లి విజయమ్మకు, సోదరి షర్మిలకు ఇచ్చిన గిఫ్ట్ డీడ్ రద్దు చేయాలని జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్‌లోని జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో పిటిషన్ కూడా దాఖలు చేసిన విషయం తెలిసిందే.

షర్మిలపై సొంత పార్టీలోనే వ్యతిరేకత?

అయితే ఈ వ్యవహారంలో వైఎస్ షర్మిలకు సొంత పార్టీ నుంచే మద్దతు కరువైంది. ప్ర‌స్తుతం ఆమె ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలుగా ఉన్నారు. అయినా జగన్మోహన్ రెడ్డితో ఆస్తి వివాదంలో ఇప్పటి వరకు ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా నోరెత్తలేదు. కనీసం పార్టీలో ఎక్కడా ఈ విషయం గురించి ప్రస్తావన కూడా రాలేదు. ఇటీవ‌ల ష‌ర్మిల తానే నియ‌మించుకున్న అధికార ప్ర‌తినిధులు, ఇత‌ర నాయ‌కులు అండ‌గా నిల‌బ‌డ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. అయితే ఇందుకు కారణం లేకపోలేదు. రాజ‌కీయంగా కాంగ్రెస్‌కు జ‌గ‌న్ ద‌గ్గ‌ర అవుతున్నార‌నే ప్ర‌చారం నేప‌థ్యంలో పార్టీని దెబ్బ‌తీసేలా ష‌ర్మిల వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే భావ‌న కాంగ్రెస్ నేత‌ల్లో ఉందట. అంతేకాదు, కాంగ్రెస్ నేత‌లు ఆఫ్ ది రికార్డుగా ష‌ర్మిల‌నే త‌ప్పు ప‌డుతున్నారట. వైఎస్సార్ కుమార్తెకు కాంగ్రెస్ ప‌గ్గాలు అప్ప‌గిస్తే బ‌ల‌ప‌డుతుంద‌ని న‌మ్మామ‌ని, కానీ ప్ర‌స్తుత ప‌రిణామాలు చూస్తే, పూర్తిగా నాశ‌నం చేసే వ‌ర‌కూ నిద్రపోయేలా లేర‌నే విమ‌ర్శ ఏపీ కాంగ్రెస్ నేత‌ల నుంచి వ‌స్తోంది.

షర్మిలది చంద్రబాబు రాసిన స్క్రిప్ట్!

ఈ వ్యవహారంలో ష‌ర్మిల‌కు టీడీపీ మ‌ద్ద‌తుగా నిలిచింది. ష‌ర్మిల‌, విజ‌య‌మ్మ‌ల‌కు జ‌గ‌న్ అన్యాయం చేశార‌ని టీడీపీ నేత‌లు తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. సీఎం చంద్ర‌బాబునాయుడు కూడా చివ‌రికి త‌ల్లికి, చెల్లికి కూడా అన్యాయం చేశార‌ని ఆరోపించిన సంగ‌తి తెలిసిందే. దీన్ని బట్టి వైఎస్ షర్మిల చంద్రబాబు వదిలిన బాణమని తేలిపోయిందని, ఆయన రాసిచ్చిన స్క్రిప్ట్‌నే షర్మిల చదువుతున్నారని, అందరూ కలిసి జగన్‌ను రాజకీయంగా దెబ్బకొట్టేందుకు కుట్ర పన్నుతున్నారని వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారు.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button