YS Sharmila: జగన్‌పై వ్యక్తిగత విమర్శల వెనుక షర్మిల ఆంతర్యం అదేనా?
జగన్మోహన్ రెడ్డి మీద రాజకీయ కక్షసాధింపు కోసమే వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ప్రవేశించినట్లు అర్థం అవుతోంది. అందుకు కూటమి పార్టీలతో కలిసి తన అన్నపై షర్మిల కక్ష తీర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. పేరుకు ఆమె ఏపీసీసీ అధ్యక్షురాలిగా ఉన్నారు. వాస్తవానికి ఆమె ఏపీలో ఒక ప్రతిపక్ష పార్టీకి అధినేత్రి బాధ్యతలో ఉన్నారు. సాధారణంగా ప్రతిపక్ష పార్టీగా ఎక్కడైనా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై విమర్శలు చేస్తుంటారు. అదేంటో గానీ, ప్రతి సందర్భంలోనూ వైసీపీని, వ్యక్తిగతంగా జగన్ దంపతులను టార్గెట్ చేయడమే ఏకైక ఎజెండాతో షర్మిల రాజకీయం చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
జగన్, భారతిల అరెస్ట్ కోసమేనా?
ఇప్పటికే పలు సందర్భాల్లో అన్న జగన్, వదిన భారతిలపై తన అక్కసును షర్మిల బయట పెట్టుకున్నారు. తాను కోరుకున్నట్టుగా ఆస్తుల్ని పంపకం చేయలేదని ఆమె విపరీతమైన ద్వేషాన్ని పెంచుకున్నారు. ఇవాళ కడపలో షర్మిల మీడియాతో మాట్లాడుతూ జగన్‌పై తన అక్కసును మరోసారి బయట పెట్టుకున్నారు. ఎంపీ అవినాష్‌రెడ్డిని సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇంతటితో ఆమె ఆగలేదు. వైఎస్ జగన్, భారతిని కూడా అరెస్ట్ చేయాలనే అర్థం వచ్చేలా పరోక్ష కామెంట్స్ చేశారు. ‘ఎంపీ అవినాశ్‌రెడ్డి ఆదేశాల మేరకే పోస్టులు పెట్టానంటూ వాటిని పెట్టిన వ్యక్తే స్పష్టంగా చెప్పినపుడు అతన్ని ఎందుకు అదుపులోకి తీసుకోలేదో, ఎందుకు విచారించలేదో పోలీసులు సమాధానం ఇవ్వాలి. చేయించేవాళ్లు ఏ ప్యాలెస్‌లలో బతుకుతున్నా అరెస్టు చేసి ఆడవాళ్లకు భద్రత కల్పించాలి’ అని అన్నారు. ఏ ప్యాలెస్‌లలో ఉన్నా అంటే, తాడేపల్లిలో ఉన్న తన అన్న, వదినలను ఎందుకు అరెస్ట్ చేయలేదని షర్మిల పరోక్షంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుండడం గమనార్హం. మరి ఒక జాతీయ పార్టీ హోదాని తన వ్యక్తిగత కక్షసాధింపులకు ఉపయోగించుకుంటున్న షర్మిల నేతృత్వంలో ఆ పార్టీ ఏ తీరానికి చేరుతుందో వేచి చూడాల్సిందే.