CBI charge sheet in Delhi Liquor case: ఢిల్లీ లిక్కర్ కేసు.. సీబీఐ ఛార్జ్ షీట్‌లో కేజ్రీవాల్!
ఢిల్లీ లిక్కర్ కేసులో సీబీఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు పలువురి పేర్లను ఛార్జ్ షీట్‌లో చేర్చింది. ఇంతకు ముందే సీబీఐ ఒక ప్రధాన ఛార్జ్ షీట్ తో పాటు నాలుగు అనుబంధ అభియోగ పత్రాలను దాఖలు చేసింది. అయితే సోమవారం తాము దాఖలు చేసిన ఛార్జ్ షీట్.. ఢిల్లీ లిక్కర్ కేసులో చివరిదని వెల్లడించింది.
గత చార్జ్ షీట్లలో సీఎం కేజ్రీవాల్‌తో పాటు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఎమ్మెల్సీ కవిత, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిలపై సీబీఐ పలు అభియెగాలను మోపింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మార్పులు చేయడం ద్వారా మద్యం వ్యాపారులు, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వ పెద్దలకు లబ్ధి చేకూరిందని దర్యాప్తు సంస్థ ఆరోపించింది. ఈ కేసులో ఎంపీ కేజ్రీవాల్ ఆగస్టు 8వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీలో ఉండనున్నారు.
సీబీఐ గతంలో చేసిన అభియోగాల ప్రకారం, ఏపీకి చెందిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి 2021 మార్చి 16 వ తేదీన ఢిల్లీ సెక్రటేరియట్‌లో సీఎం కేజ్రీవాల్‌తో భేటీ అయ్యారు. 2021-2022 ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో మార్పులు చేసి మద్యం వ్యాపారంలో తమకు మద్దత ఇవ్వాలని కోరారు. అందుకు అంగీకరించిన కేజ్రీవాల్ అప్పటికే ఈ విషయంలో తమతో కలిసి పనిచేసున్న కల్వకుంట్ల కవితను కలవాలని సూచించారు.
తాము చేస్తున్న సాయానికి ప్రతిగా ఆమ్ ఆద్మీ పార్టీకి నిధులు ఇవ్వాలని కేజ్రీవాల్ కోరారు. కవిత సహా పలువురు మద్యం వ్యాపారులతో కూడిన సౌత్ గ్రూప్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి, ఢిల్లీ ప్రభుత్వంలోని పలువురు పెద్దలకు రూ. 90 కోట్ల నుంచి రూ. 100 కోట్ల వరకు నిధులు అందాయని సీబీఐ ఆరోపించింది.