Delhi: ఢిల్లీ ప్రభుత్వంలో మరో కుదుపు.. కీలక మంత్రి రాజీనామా!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీలో భారీ కుదుపు చోటుచేసుకుంది. ఢిల్లీ రవాణా శాఖ మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రముఖ నేత కైలాష్ గెహ్లాట్ ఆప్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడమే తన రాజీనామాకు కారణమని పేర్కొన్నారు. ఈ మేరకు కేజ్రీవాల్‌కు లేఖ రాశారు. అతిశీ ప్రభుత్వంలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. తన రాజీనామాలో… యమునాను శుభ్రపరచడం, కేజ్రీవాల్ బంగ్లా నిర్మాణం అంశాన్ని కూడా లేవనెత్తారు. గత ఎన్నికల్లో యమునా నదిని శుభ్రం చేస్తామని హామీ ఇచ్చామని, అయితే యమునా నదిని శుభ్రం చేయలేకపోయామని గెహ్లాట్ పేర్కొన్నారు.
మంత్రి రాజీనామాకు సీఎం ఆమోదం
‘నయా బంగ్లా లాంటి సిగ్గుమాలిన, విచిత్రమైన వివాదాలు చాలానే ఉన్నాయి. మనం ఇంకా సామాన్యులమని నమ్ముతున్నామా అనే సందేహాన్ని ఇప్పుడు అందరిలో కలుగజేస్తున్నాయన్నారు. ఢిల్లీ ప్రభుత్వం కేంద్రంపై పోరాటంలో ఎక్కువ సమయం గడిపితే ఢిల్లీకి నిజమైన పురోగతి ఉండదని ఇప్పుడు స్పష్టమైంది. ఆప్ నుంచి విడిపోవడం తప్ప నాకు వేరే మార్గం లేదు. అందుకే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. అని లేఖలో పేర్కొన్నారు. కాగా.. కైలాష్ గెహ్లాట్ రాజీనామాను ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి ఆమోదించారు.