Delhi: దేశ చరిత్రలో ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించిన 17వ మహిళగా ఆతిశీ!
ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా ఆప్ నేత ఆతిశీ ప్రమాణస్వీకారం చేశారు. రాజ్ నివాస్ లో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆమె మంత్రిమండలితో కలిసి ప్రమాణం చేయించారు. దీంతో దేశ చరిత్రలో ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించిన 17వ మహిళగా, ఢిల్లీకి ఆరో సీఎంగా ఆతిశీ నిలిచారు. అలాగే అత్యంత పిన్న వయసులోనే ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న మహిళగా కూడా ఆతిశీ మార్లేనా సింగ్ నిలిచారు. అంతకు ముందు ఢిల్లీకి 15 ఏళ్ల పాటు వరుసగా షీలా దీక్షిత్ ముఖ్యమంత్రిగా సేవలందించారు. 1998 నుంచి 2013 వరకు మూడు పర్యాయాల పాటు ఆమె ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఆ తర్వాత ఢిల్లీ సీఎం పీఠం ఆప్ వశమైంది. బీజేపీ నుంచి 1998లో సుష్మా స్వరాజ్ కేవలం 52 రోజుల ఢిల్లీ సీఎంగా వ్యవహరించారు. షీలాదీక్షిత్ సీఎంగా బాధ్యతలు చేపట్టే నాటికి ఆమె వయసు 60 ఏళ్లు. సుష్మాస్వరాజ్ 46 ఏళ్లకే సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. ఆతిశీ మాత్రం 43 ఏళ్లకే సీఎంగా బాధ్యతలు చేపట్టడం విశేషం. ప్రస్తుతం దేశంలో పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ, ఢీల్లీలో అతిశీ మినహా మరే రాష్ట్రంలోనూ మహిళా సీఎంలు లేరు. గతంలో మెహబూబా ముఫ్తీ (జమ్మూకశ్మీర్), మాయావతి (యూపీ), రబ్రీ దేవి (బిహార్), జయలలిత (తమిళనాడు) తదితరులు ముఖ్యమంత్రులుగా బాధ్యతలు నిర్వహించారు.
కేజ్రీవాల్ జైలుకెళ్లినప్పుడు అంతా తానై..
2013లో ఆప్‌లో చేరిన ఆతిశీ అదే ఏడాది పార్టీ ప్రణాళిక ముసాయిదా కమిటీలో సభ్యురాలిగా ఉన్నారు. 2020లో కల్కాజీ నుంచి గెలుపొందారు. గత ఏడాది ఫిబ్రవరిలో డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అరెస్టయిన సంక్షోభ పరిస్థితుల్లో ఆమె మంత్రి పదవిని చేపట్టారు. అత్యంత కీలకమైన మంత్రిత్వ శాఖలను చేపట్టిన ఆతిశీ.. సీఎం జైలుకెళ్లినప్పుడు అటు ప్రభుత్వాన్ని, ఇటు పార్టీని ఏకతాటిపై నిలిపారు. సలహాదారు పదవి నుంచి మంత్రి స్థాయికి, తాజాగా ముఖ్యమంత్రిగా ఎదిగిన ఆతిశీ అతి చిన్న వయసులోనే అత్యధిక శాఖలు నిర్వహించిన మహిళగా ఖ్యాతి పొందారు. ఆప్ వ్యవస్థాపక సభ్యులలో ఒకరిగా పార్టీ విధానాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు.