Delhi: ఢిల్లీ సీఎం పగ్గాలు అతిశీకే.. ఎందుకంటే..?
ఢిల్లీ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయనున్న నేపథ్యంలో ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా అతిశీ పేరును ఆప్ కన్వీనర్, ప్రస్తుత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎంపిక చేశారు. దీంతో ఢిల్లీ కొత్త సీఎం ఎవరన్నదానిపై గత రెండు రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. అతిశీ పేరును కేజ్రీవాల్ ప్రతిపాదించగా, ఇతర ఎమ్మెల్యేలు బలపరిచారు. దీంతో ఢిల్లీ తుదపరి సీఎంగా ఆమె ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహితురాలు
సీఎం కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహితుల్లో అతిశీ మినహా అందరూ మద్యం కేసులో జైలుకు వెళ్లారు. మార్చి 21న ఆయన కూడా అరెస్టు కావడంతో ఆప్ పగ్గాలు చేపట్టడానికి ద్వితీయశ్రేణి నాయకత్వం కరవైంది. నాడు అతిశీ పేరు తెరపైకి వచ్చినా.. కేజ్రీవాల్ జైలు నుంచే ప్రభుత్వాన్ని నడపాలని నిర్ణయించుకొన్నారు. ఆ సమయంలో అతిశీ అన్నీ తానై సౌరభ్ భరద్వాజ్‌తో కలిసి పార్టీని ముందుకు నడిపారు. ఓవైపు లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తుండటంతో నాడు మీడియాలో పార్టీపై ప్రతిపక్షాల దాడులను సమర్థంగా ఎదుర్కొన్నారు. హర్యానా నుంచి ఢిల్లీకి రోజుకు 100 మిలియన్ గ్యాలెన్ల నీటిని విడుదల చేయడం లేదంటూ ఏకంగా జూన్‌లో నిరాహార దీక్ష చేపట్టారు. ఆ సమయంలో ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రి పాలయ్యారు.
ఉన్నత విద్యావంతురాలు
పార్టీ మొత్తంలోనే అతిశీ ఉన్నత విద్యావంతురాలు కావడం రాజకీయాలకు బాగా కలిసొచ్చింది. ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అనంతరం రోడ్స్ స్కాలర్‌షిప్‌పై ఆక్స్‌ఫర్డ్‌లో విద్యాభ్యాసం చేశారు. ఆప్‌లో చేరడానికి ముందు ఆమె ఏడేళ్లపాటు మధ్యప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో సేంద్రియ వ్యవసాయం, విద్యాభ్యాసంపై పని చేశారు. చాలా ఎన్‌జీవోలతో కలిసి పనిచేసిన అనుభవం ఆమెకు ఉంది. 2015లో మధ్యప్రదేశ్‌లోని ఖాంద్వా జిల్లాలో జరిగిన జల్ సత్యాగ్రహ్‌లో పాల్గొన్నారు. ఈ సమయంలోనే ఆప్ సభ్యులతో పరిచయాలు ఏర్పడి.. పార్టీ ఆవిర్భావ సమయంలో సభ్యత్వం తీసుకొన్నారు. 2013 ఎన్నికల మేనిఫెస్టో డ్రాఫ్టింగ్ కమిటీ సభ్యురాలిగా బాధ్యతలు నిర్వహించారు. తొలినాళ్లలో పార్టీ పాలసీ తయారీలో ఆమె కీలక భూమిక పోషించారు. ఇది పట్టణ, మధ్యతరగతి వర్గాల్లో ఆప్‌నకు మంచి ఇమేజ్ ఇచ్చే అంశం.
2020లో తొలిసారి గెలుపు
2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆమె తూర్పు ఢిల్లీ నుంచి ఆప్ అభ్యర్థిగా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్‌పై పోటీచేసి 4.5 లక్షల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె దక్షిణ ఢిల్లీలోని కల్కాజీ నియోజకవర్గం నుంచి పార్టీ టికెట్‌పై బరిలోకి దిగి 11వేల ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థిపై విజయం సాధించారు.