Delhi: దేశంలోనే తొలి ‘మహిళా’ బస్ డిపో ప్రారంభం.. ఎక్కడో తెలుసా?
దేశ రాజధాని ఢిల్లీ మరో అరుదైన ఘనతను సాధించింది. దేశంలోనే తొలి ‘మహిళా’ బస్ డిపోను ఆ రాష్ట్ర రవాణా మంత్రి కైలాశ్ గహ్లోత్ ప్రారంభించారు. ఢిల్లీలోని సరోజిని నగర్‌లో పూర్తి స్థాయి మహిళా సిబ్బందితో కూడిన ఈ డిపోకు సఖి డిపో అని పేరు పెట్టినట్లుగా పేర్కొన్నారు. ఇందులో డిపో మేనేజర్, డ్రైవర్లు, కండక్టర్లు ఇలా సిబ్బంది అంతా మహిళలే అని.. దీని కోసం మొత్తం 225 మంది సిబ్బందిని కేటాయించామని ఆయన తెలిపారు. అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్న మహిళలు రవాణా రంగంలోనూ తమ హక్కులను పొందాలనే ఉద్దేశంతో ఈ డిపోను ప్రారంభించినట్లు మంత్రి పేర్కొన్నారు.
అంతలోనే మహిళా ఉద్యోగుల నిరసన
కాగా, దేశంలోనే తొలి ‘మహిళా’ బస్ డిపోను ప్రారంభించడం మంచిదే అయినా.. ప్రస్తుతం రవాణా రంగంలో పని చేస్తున్న తమకు సరైన సౌకర్యాలు లేవని మహిళా ఉద్యోగులు మంత్రి ఎదుట నిరసన చేపట్టారు. ఫిక్స్‌డ్ జీతం, పర్మినెంట్ ఉద్యోగాలకు మంత్రి హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. విధులకు హాజరు కావాలంటే ఉదయం 6 గంటలకే ఇళ్ల నుంచి బయల్దేరి..కిలోమీటర్ల మేర ప్రయాణం చేయాలని..అయినా ఒక్కోసారి సమయానికి పని ప్రదేశానికి చేరుకోలేక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు.