
Elections: ఎగ్జిట్‌పోల్స్‌ను బోల్తా కొట్టించిన హర్యానా, జమ్ముకశ్మీర్ ఫలితాలు
జమ్ము కశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్‌పోల్స్ బోల్తా పడ్డాయి. ఎగ్జాట్స్ పోల్స్‌కు విరుద్ధంగా ఫలితాలు వస్తున్నాయి. హర్యానాలో బీజేపీ గెలుపు దాదాపు ఖాయం అయ్యింది. హ్యాట్రిక్ కొట్టబోతున్నామంటూ ఆ పార్టీ నేతలు ఇప్పటికే సంబరాలు కూడా మొదలుపెట్టారు. . ఇక జమ్ము కశ్మీర్‌లో బీజేపీదే గెలుపు అని ఊదరగొట్టిన ఎగ్జిట్‌పోల్స్‌కి షాక్ తగిలింది. ఇండియా కూటమి (నేషనల్ కాన్ఫరెన్స్)కే ప్రజలు పట్టం కట్టారు. ఇంకా పూర్తి స్థాయి ఫలితాలు వెల్లడి కాకున్నా.. ఆధిక్యాన్ని బట్టి గెలుపోటములు దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. హర్యానాలో మొత్తం 90 స్థానాలకు గానూ బీజేపీ 50 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక ఇండియా కూటమి కేవలం 34 స్థానాల్లోనే ఆధిక్యంలో ఉంది. మరోవైపు జమ్ముకశ్మీర్‌లో మొత్తం 90 స్థానాలకు గానూ ఇండియా కూటమి నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ 47 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. బీజేపీ కేవలం 29 స్థానాలకే పరిమితమైంది.
హర్యానాలో చతికిలపడ్డ కాంగ్రెస్
హర్యానాలో బీజేపీ వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా పరుగులు పెడుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో రిజర్వేషన్ల విషయంలో బీజేపీపై బాకా ఊపిన కాంగ్రెస్.. హర్యానాలో అదే ట్రిక్ ప్లే చేసింది కానీ ఇక్కడ మాత్రం బీజేపీ వ్యూహాన్ని బద్దలు కొట్టలేకపోయింది. చాలా మంది కాంగ్రెస్ నేతలు తమ సొంత సీట్లకే పరిమితమయ్యారు. ఇది కాకుండా, ఎన్నికల సమయంలో ఇతర పార్టీల నుండి వారిని చేర్చుకునే అంశం కూడా కొన్ని స్థానాల్లో కాంగ్రెస్‌కు హానికరంగా మారింది. బీజేపీ లబ్ధిదారుల వర్గాన్ని కాంగ్రెస్ చీల్చలేకపోయింది. అంతే కాకుండా కుస్తీలు, రైతుల సమస్య కాంగ్రెస్‌కు కలిసిరాలేదు. అంతేకాదు, సీఎంగా మనోహర్ లాల్ ఖట్టర్‌పై సొంత పార్టీపైనే కాకుండా, ప్రజల్లోనూ తీవ్ర వ్యతిరేక వచ్చిన నేపథ్యంలో ఆయనను పదవి నుంచి తప్పించి బీజేపీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఆయనను తొలగించిన తీరు ప్రజల్లో ఒక రకమైన సానుభూతిని రాబట్టుకోగలిగింది. ఇక ఉద్యోగాలలో అవినీతి ఆరోపణల ధోరణిని ఆపడానికి బీజేపీ చాలా గట్టిగానే తన బాణీని వినిపించింది. భూపేంద్ర హుడా పదేళ్ల పదవీ కాలంలో డబ్బు చెల్లించి, స్లిప్పుల ఆధారంగానే ఉద్యోగాలు ఇచ్చారని, అంటే సిఫారసుల ఆధారంగానే ఉద్యోగాలు ఇచ్చారని ఎక్స్‌పెండిచర్ స్లిప్‌ల వ్యవహారాన్ని బీజేపీ జనంలోకి తీసుకుపోగలిగింది.
బీజేపీకి కలిసిరాని ‘ఆర్టికల్ 370 రద్దు’
ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ము కశ్మీర్ ఎంతో వేగంగా అభివృద్ధి చెందిందని, ఆ క్రెడిట్ మొత్తం బీజేపీకే దక్కుతుందని ఎన్నికల్లో ఆ పార్టీ తెగ ప్రచారం చేసింది. అంతేకాదు, జమ్ము కశ్మీర్‌ను అన్ని రాష్ట్రాలతో సమానంగా పరుగులు పెట్టిండం ఒక్క బీజేపీకే సాధ్యమని ప్రచారం చేశారు. ఎప్పుడూ లేనిది స్వాతంత్య్ర దినోత్సవాల వేళ, గణతంత్ర దినోత్సవాల వేళ లాల్ చౌక్ లో త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోందని, దీనికి కారణం బీజేపీనే అని ప్రచారం చేశారు. అంతేకాదు, కశ్మీర్ ను వదిలి వెళ్లిపోయిన పండిట్స్ కుటుంబాలను తిరిగి రప్పిస్తామని, వారికి జీవనోపాధిని కల్పిస్తామని హామీ ఇచ్చింది. కానీ ఇవేవీ బీజేపీకి కలిసి రాలేదు.