Former PM Manmohan Singh: మచ్చలేని నాయకుడు.. మన్మోహనుడు!
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) మృతి దేశానికి తీరని లోటు. దేశ రాజకీయాల్లో ఆయన లాంటి నాయకులు చాలా అరుదుగా ఉంటారని చెప్పొచ్చు. అతి సాధారణ కుటుంబంలో పుట్టి కిరోసిన్ దీపాల వెలుగులో చదువుకున్న ఆయన.. దేశ అత్యున్నత స్థానానికి చేరుకోవడం వెనుక ఆయన కృషి అనన్య సామాన్యం. ప్రధానిగా పదేళ్లు సేవలందించిన ఆయన మచ్చలేని నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. అంతకుముందు ఆర్థిక మంత్రిగా భారత ఆర్థిక వ్యవస్థలో పెను మార్పులు తీసుకొచ్చారు. భారత ఆర్థిక ప్రగతిని పరుగులు పెట్టించారు.
ఎన్నో విప్లవాత్మక కార్యక్రమాలకు నాంది!
ప్రధానిగా మన్మోహన్ సింగ్ ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. తనను మౌన ప్రధాని అని విపక్షాలు ఎంత విమర్శించినా తన పాలనతోనే ఆ విమర్శలకు సమాధానం ఇచ్చేవారు. తక్కువ మాట్లాడటం, ఎక్కువ పనిచేయడం ఆయన నైజం. ప్రధానిగా మన్మోహన్ పని చేసిన కాలంలో ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నా. ప్రత్యేక ఆర్థిక మండళ్ల ఏర్పాటు, సమాచార హక్కు చట్టం, జాతీయ ఉపాధి హామీ పథకం, అమెరికాతో అణు ఒప్పందం, చంద్రయాన్, మంగళ్‌యాన్, విద్యా హక్కు చట్టం, ఆహార భద్రత చట్టం, ఆధార్ కార్డుల వంటివి మన్మోహన్ హయాంలో రూపుదిద్దుకున్నవే.
సుదీర్ఘ ప్రస్థానం!
యూపీఏ హయాంలో 2004 నుంచి 2014 వరకూ మన్మోహన్ సింగ్ ప్రధానిగా పని చేశారు. అంతకుముందు పీవీ నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా విశేష సేవలందించి భారత ఆర్థిక రంగాన్ని పరుగులు పెట్టించారు. ఆర్‌బీఐ గవర్నర్‌గానూ తనదైన పనితీరు కనబరిచారు. మొత్తం 33 ఏళ్లపాటు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగిన ఆయన ఇటీవల అనారోగ్య కారణాలతో క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. గత కొన్ని నెలలుగా ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ వస్తోంది. 1987లో ఆయనను కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డుతో సత్కరించింది.
తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర
మన్మోహన్ సింగ్ హయాంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కాంగ్రెస్ ఏపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారని.. కేంద్ర కేబినెట్‌లో ఉన్న ఏపీ నేతలు రాజీనామా చేస్తామన్నా మన్మోహన్ సింగ్ వెనక్కి తగ్గలేదు. పార్లమెంట్‌లో రచ్చ జరిగినా ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు మన్మోహన్ సింగ్. పార్లమెంట్‌లో ప్రత్యేక తెలంగాణ బిల్లు పాస్ చేయించడంలో మన్మోహన్ సింగ్ కీలక భూమిక పోషించారు.
ఏపీకి ప్రత్యేక హోదా కోసం డిమాండ్
మన్మోహన్ సింగ్‌కు తెలుగు రాష్ట్రాలతో విడదీయలేని అనుబంధం ఉంది. ప్రధానిగా పేదలకు ఉపయోగపడే ఎన్నో పథకాలను ఆయన తీసుకొచ్చారు. పేదలు పస్తులు ఉండొద్దన్న ఉద్దేశంతో పనికి ఆహార పథకాన్ని ప్రవేశపెట్టారు. ఆ పథకాన్ని అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచే ప్రారంభించారు. అనంతపురంలో ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం యూపీఏ ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చి పెట్టింది. అలాగే పేదల కడుపు నింపింది. ఇప్పటికీ ఈ పథకం ఎంతో మంది పేదలకు ఆసరాగా నిలస్తోంది. ఇక, ఉమ్మడి రాష్ట్రం విడిపోయాక ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఆయన గొంతు వినిపించారు. రాష్ట్ర విభజన అనంతరం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారం కోల్పోయాక విభజన సమస్యల పరిష్కారం కోసం బీజేపీ ప్రభుత్వాన్ని మన్మోహన్ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని ఒత్తిడి చేశారు.