తెలుగు
te తెలుగు en English
జాతీయం

Maharashtra: మహారాష్ట్రలో ‘మహాయుతి’ కూటమి భారీ విజయానికి ఈ 5 అంశాలే కారణం!

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ‘మహాయుతి’ కూటమి భారీ విజయం సాధించి, ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలక్రిందులు చేసేసింది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ 145 సీట్లను ఇప్పటికే అధిగమించింది. 200 సీట్ల మార్క్‎ను సైతం క్రాస్ చేసింది. అయితే మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి గెలుపునకు మొత్తం 5 అంశాలు దోహదం చేసినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం.

1. ఉచిత పథకాల హామీ

మహాయుతి కూటమి విజయం సాధించడంలో ‘ఉచితాలు’ క్రియాశీలక పాత్ర పోషించాయనే చెప్పాలి. ‘ముఖ్యమంత్రి మాఝీ లడ్కీ బహిన్ యోజన స్కీమ్, లడ్కా భావు యోజన పథకంతో పాటు ఉచిత ఎల్‌పీజీ సిలిండర్ల వాగ్దానాలు ఓటర్లను విపరీతంగా ఆకర్షించాయి. ఈ పథకాలకు మహిళలు, విద్యార్థులు, యువత ఆకర్షితులయ్యారు.

2. కుల సమీకరణాలు

లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలోని ముస్లిం ఓటర్లంతా పెద్ద ఎత్తున మహా వికాస్ అఘాడీ కూటమికి ఓటేశారు. మరాఠా రిజర్వేషన్ల విషయంలో బీజేపీ సంప్రదాయ ఓటర్లు అయిన ఓబీసీలు కాషాయ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పార్లమెంట్ ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీకి భారీ ఎదురు దెబ్బతగలింది. అయితే, లోక్ సభ ఎన్నికల ఫలితాలతో గుణపాఠం నేర్చుకున్న బీజేపీ.. మరాఠాలు, ఓబీసీలకు దగ్గరైంది. శివసేన, ఎన్సీపీ పార్టీలు కూడా రెండుగా చీలడం మహాయుతి కూటమికి కలిసి వచ్చింది.

3. నినాదాలు

మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం ముఖ్యంగా నినాదాలే చుట్టే తిరిగింది. ఇండియా కూటమి కులగణన డిమాండ్ వ్యతిరేకంగా.. ప్రధాని మోడీ.. ‘ఏక్ హై తో సేఫ్ హై’ అనే నినాదంతో ప్రచారం హోరెత్తించారు. ఇక, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇచ్చిన “బాటేంగే టు కటేంగే” స్లోగన్ మహా పాలిటిక్స్‎ను మరో లెవల్‎కు తీసుకెళ్లింది. కులాల పేరుతో విడిపోతే హిందువులు కింద పడిపోతామని సీఎం యోగి ఆదిథ్య నాథ్ జోరుగా ప్రచారం చేశారు.

4. విదర్భ ఓట్లే కీలకం

మహారాష్ట్రంలో ఏ కూటమికి ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న విదర్భలో మెజార్టీ సీట్లు గెలవడం ముఖ్యం. ఇక్కడ ఎక్కువ స్థానాలు గెల్చుకున్న పార్టీనే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ వస్తోంది. అయితే, ఈ ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో విదర్భలో బీజేపీ ఘోర పరాజయం పాలైంది. 10 పార్లమెంట్ స్థానాలకు గానూ కేవలం మూడు చోట్లనే విజయం సాధించింది. దీంతో విదర్భలో తిరిగి పట్టు చేజిక్కించుకోవడం కోసం ఎన్డీఏ ఏ అవకాశాన్ని వదులుకోలేదు. బెంగాల్, హర్యానాలో బీజేపీ సక్సెస్ కావడంలో కీ రోల్ పోషించిన వ్యూహకర్త కైలాష్ విజయవర్గియాను మహయుతి కూటమి విదర్భలో దించింది. ఆయన 100 మంది సభ్యుల బృందంతో రెండు నెలల పాటు విదర్భలో మకాం వేసి బీజేపీ పుంజుకునేలా చేశారు. ఆర్ఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి విదర్భలో మహయుతి కూటమి స్ట్రాంగ్ అయ్యేలా చేశారు. దీంతో విదర్భలో ఈసారి మహాయుతి కూటమికి భారీ విజయాలు దక్కాయి.

5. పోల్ మేనేజ్మెంట్

ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా బీజేపీ పోల్ మేనేజ్మెంట్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఆ పార్టీ ఢిల్లీ నుంచి గల్లీ దాకా అందరు లీడర్లను రంగంలోకి దింపుతుంది. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీ 106 అసెంబ్లీ నియోజకవర్గాలను 10 ర్యాలీల్లో కవర్ చేయగా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా 16 ర్యాలీల ద్వారా 38 సెగ్మెంట్లలో ప్రచారం చేశారు. యోగి ఆదిత్య నాథ్ సైతం మహారాష్ట్ర ఎన్నికల్లో కటేంగ్ తో బటేంగే అంటూ ప్రచారాన్ని పీక్ స్టేజ్‎కు తీసుకుపోయారు. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే రికార్డ్ స్థాయిలో 75 ర్యాలీల్లో ప్రసంగించారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ 72 ర్యాలీలు, రోడ్‌షోల్లో పాల్గొన్నారు. ఇక మహా వికాస్ అఘాడీలో మాత్రం ఎన్సీపీ అధినేత శరద్ పవార్ 55 ర్యాలీలలో మాట్లాడారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే 7, 9 ర్యాలీలకు మాత్రమే పరిమితమయ్యారు.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button