
Miss India: ఫెమినా మిస్ ఇండియా – 2024 విజేతగా నికితా పోర్వాల్.. ఇంతకీ ఎవరీమె..?
ఫెమినా మిస్ ఇండియా-2024 విజేతగా నికితా పోర్వాల్ నిలిచారు. బుధవారం ముంబైలో జరిగినా ఈ ఫెమినా అందాల పోటీలో నికితా విజయకేతనం ఎగురవేసి కిరీటాన్ని దక్కించుకున్నారు. దీంతో త్వరలో జరగనున్న మిస్ వరల్డ్ పోటీల్లో ఈమె భారతదేశం తరుఫున పోటీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో నికితా పోర్వాల్ ఎవరని సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని ప్రాంతానికి చెందిన నికితా.. అక్కడే కార్మెల్ కాన్వెంట్ సీనియర్ సెకండరీ స్కూల్లో చదువుకున్నారు. ప్రస్తుతం బరోడాలోని మహారాజా షాయాజీరావు విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు.
నాటకాలంటే పిచ్చి..
ఇక నికితా సహజంగానే మంచి స్టోరీ టెల్లర్. ఆ అభిరుచికి జీవం పోయాలనే ఉద్దేశ్యంతోనే సుమారు 60కి పైగా నాటకాలలో నటించారు. కృష్ణలీల అనే పేరుతో 250 పేజీల నాటకాన్ని కూడా రాశారు. అంతర్జాతీయ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించిన ఫీచర్ ఫిల్మ్‌లో నికితా కూడా ఒక భాగం, త్వరలో భారతదేశంలో విడుదల కానుంది. ఆమె మాజీ ప్రపంచ సుందరి బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ అభిమాని. ఆమె గంభీరమైన వ్యవహారశైలి, తెలివితేటలంటే నికితకు అత్యంత ఇష్టమట. ఆధునికతను స్వీకరించటంతో పాటు భారతీయ వారసత్వానికి కూడా ప్రాధాన్యం ఇచ్చే వైఖరిలో ఐశ్వర్యకు సాటిలేరని అంటారు నికితా. ఇక నికిత జంతు ప్రేమికురాలు కూడా. మన అభివృద్ధితో పాటు మనపై ఆధారపడిన జీవుల సంరక్షణ బాధ్యత కూడా మనదే అనేది ఆమె నమ్మకం. బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలీతో కలిసి ఓ మూవీలో నటించాలని ఆమె కోరిక.