One Nation-One Election: కేంద్ర కేబినెట్ ఆమోదించిన ‘జమిలీ’ ఎన్నికలతో లాభాలేంటి? నష్టాలేంటి?
ఎన్డీయే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జమిలీ ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. పార్లమెంటు నుంచి పంచాయతీ వరకు అన్ని ఎన్నికలనూ ఒకేసారి నిర్వహించడంపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో రూపొందించిన నివేదికకు భారత రాష్ట్రపతికి ఈ ఏడాది మార్చిలో అందించారు. దీనికి కేంద్ర మంత్రివర్గం ఈ సెప్టెంబరులోనే పచ్చజెండా ఊపింది. అయితే శీతాకాల సమావేశాల్లోనే ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని భావిస్తోన్న ప్రభుత్వం.. తాజాగా కేంద్ర కేబినెట్‌లో ఆమోద ముద్ర వేసింది. అయితే దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలను నిర్వహించాలని గతంలోనూ అనేక ప్రభుత్వాలు ప్రయత్నించాయి. కానీ అది సాధ్యం కాలేదు. దానికి కారణం ఈ ఎన్నికల వల్ల లాభాలెన్ని ఉన్నాయో.. అలాగే నష్టాలు కూడా అన్నే ఉన్నాయి. అందుకే ఈ ఎన్నికలకు అడుగు ముందుకు పడినప్పుడల్లా.. రెండు అడుగులు వెనక్కి పడాల్సి వచ్చింది.
లాభాలు
- తరచూ వచ్చే ఎన్నికల కోడ్ వంటి అడ్డంకులు తప్పడం వల్ల అభివృద్ధి కార్యక్రమాలపై ప్రభుత్వాలు దృష్టిసారించవచ్చు.
- ఎన్నికల వ్యయం, సిబ్బంది వినియోగం, నిర్వహణ భారం తగ్గుతుంది.
- ఓటింగ్ శాతం పెరుగుతుంది.
- ఒకేసారి ఎన్నికల నిర్వహణతో ఓటు వేయడానికి ప్రజలు తరుచూ వేరే ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఉత్పాదకత పెరుగుతుంది.
నష్టాలు
- భారత్ వంటి అత్యధిక జనాభా కలిగిన దేశంలో ఒకేసారి ఎన్నికలు కష్టం. పారదర్శకతపై అనుమానాలు కలుగొచ్చు.
- జమిలీపై రాజ్యాంగంలో ప్రస్తావన లేదు కాబట్టి, ఇప్పటికైతే ఇది రాజ్యాంగ విరుద్ధం.
- గడువులోపే ప్రభుత్వాలు పడిపోతే జమిలీ లక్ష్యమే దెబ్బతింటుంది. అవిశ్వాసం ఎదుర్కొనే ప్రభుత్వాల విషయంలోనూ ఇది జరుగొచ్చు.
- జమిలీతో జాతీయ పార్టీలకు మేలు జరుగొచ్చు. జాతీయ అంశాల ఆధారంగా అసెంబ్లీకి కూడా ప్రజలు ఓటేస్తే, ప్రాంతీయ పార్టీలు ఎన్నికల్లో దెబ్బతినే ప్రమాదం ఉన్నది.
- జమిలీ నిర్వహణకు భారీగా సిబ్బంది, ఈవీఎంలు, వీవీప్యాట్లు అవసరం.