Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి పార్లమెంట్ వరకు.. వయనాడ్‌లో ప్రియాంక గాంధీ సంచలన విజయం!
ఇవాళ మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. అయితే ఈ రెండు రాష్ట్రాల ఫలితాల కంటే దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన స్థానం మాత్రం ఒకే ఒక్కటి. అదే కేరళలోని వయనాడ్ ఉపఎన్నిక. లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ.. తాను పోటీ చేసిన రెండు (రాయ్‌బరేలి, వయనాడ్) స్థానాల్లోనూ గెలుపొందడంతో వయనాడ్ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. అయితే ఈ స్థానం నుంచి రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ పోటీ చేయడంతో కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. ప్రియాంక గెలుపు కోసం ఆ పార్టీ సర్వశక్తులు ఒడ్డింది. చివరకు అందరూ ఊహించినట్టుగానే ప్రియాంక గాంధీ భారీ మెజారిటీ (3 లక్షలకు పైగా)తో సంచలన విజయం సాధించారు.
అలా మొదలైన ప్రియంకా రాజకీయ ప్రయాణం
సరిగ్గా రెండు దశాబ్దాల క్రితం 2004లో ప్రియాంక తొలిసారి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. క్రియాశీల రాజకీయాల్లో ఉండకపోయినా.. ఆ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తల్లి సోనియా, సోదరుడు రాహుల్ గాంధీ తరఫున ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్ వెలుపలా కొన్ని చోట్ల ర్యాలీల్లో కన్పించారు. అయితే, ఆమె క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టింది మాత్రం 2019లోనే..! ఆ ఏడాది జనవరిలో ఆమె ఉత్తరప్రదేశ్ తూర్పు విభాగానికి కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా నియమితులయ్యారు. ఆ మరుసటి ఏడాది మొత్తం యూపీకి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అందుకున్నారు.
ఇంతింతై అన్నట్లుగా..
2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర వైఫల్యానికి బాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్ష పదవి నుంచి రాహుల్ గాంధీ వైదొలిగారు. ఆ సమయంలో ప్రియాంక ఆ బాధ్యతలు చేపట్టాలని కాంగ్రెస్‌లో డిమాండ్లు వినిపించాయి. సీనియర్ నేతలు కూడా ఒక దశలో ఆమె వైపు మొగ్గు చూపారు. కానీ, ప్రియాంక దాన్ని సున్నితంగా తిరస్కరించారు. ఆ తర్వాత 2022లో యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచార బాధ్యతలను భుజానెత్తుకున్నారు. రాష్ట్రమంతటా తిరిగి ప్రజల దృష్టిని ఆకర్షించారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయినప్పటికీ.. ప్రియాంక ప్రచారం మాత్రం మెప్పించింది. యూపీలో కాంగ్రెస్ ఓటమి తర్వాత 2022 చివర్లో జరిగిన హిమాచల్ అసెంబ్లీ ఎన్నికలతో ప్రియాంక యావత్ దేశం దృష్టిని ఆకర్షించారు. ఆ ఎన్నికల్లో తెరవెనుక ఆమె అన్నీ తానై పార్టీని నడిపించి విజయాన్నిందించారు. అప్పటి నుంచి పార్టీలో కీలక ప్రచారకర్తగా మారిపోయారు. ఆ తర్వాత జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారాల్లోనూ చురుగ్గా పాల్గొని పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు తల్లి సోనియా ప్రత్యక్ష ఎన్నికల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. దీంతో రాయ్‌బరేలీ నుంచి ప్రియాంక ప్రత్యక్ష ఎన్నికల అరంగేట్రం చేస్తారని జోరుగా ప్రచారం జరిగింది. అనూహ్యంగా అక్కడి నుంచి రాహుల్ బరిలోకి దిగారు. లోక్‌సభ ఎన్నికల్లో విస్తృత ప్రచారం కోసమే అప్పట్లో ఆమె పోటీకి దూరంగా ఉన్నారు.
మోదీకి సమాధానం ఇవ్వగల నేతగా..
సమర్థ ప్రచారకర్త కోసం కాంగ్రెస్ కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్న తరుణంలో.. 2024 ఎన్నికల నాటికి మోదీకి దీటుగా సమాధానమివ్వగల బలమైన నేతగా ప్రియాంక మారారు. వ్యూహకర్తగా, మాటల మాంత్రికురాలిగా, జనాకర్షక నాయకురాలిగా ఎదిగారు. కాంగ్రెస్ వస్తే మన బంగారం, మంగళసూత్రాలను లాక్కుంటుందన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలను గట్టిగా తిప్పికొట్టారు. తన తల్లి సోనియా గాంధీ దేశం కోసం తన మంగళ సూత్రాన్ని త్యాగం చేశారని స్పష్టం చేశారు.
అన్న రికార్డ్‌నే బద్దలు కొట్టిన చెల్లెలు!
ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రెండు చోట్ల నుంచి విజయం సాధించిన రాహుల్.. ఆ తర్వాత వయనాడ్ వదులుకున్నారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమవగా.. ప్రియాంక గాంధీ పోటీ చేశారు. ప్రచారంలో తన మార్క్‌తో దూసుకెళ్లారు. ‘ఆమె స్థానికేతరురాలు’ అంటూ ప్రత్యర్థులు చేసిన విమర్శలకు.. ‘ప్రజలు గెంటేసే వరకు వెళ్లిపోను’ అంటూ ఘాటుగా బదులిచ్చారు. మహిళ, యువత సమస్యలను ప్రధానంగా ఎత్తిచూపుతూ ఓటర్ల దృష్టిని ఆకర్షించారు. తాజాగా వెలువడిన ఫలితాల్లో భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈ స్థానంలో తన సోదరుడు రాహుల్ గాంధీ సాధించిన 3.64లక్షల ఓట్ల మెజార్టీని ప్రియాంక (4లక్షల ఓట్ల పైచిలుకు) దాటేశారు.