తెలుగు
te తెలుగు en English
జాతీయం

SC, ST Classification: సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు… ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు పచ్చ జెండా

ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు సుప్రీంకోర్టు పచ్చ జెండా ఊపింది. ఎస్సీ వర్గీకరణను సమర్థిస్తూ చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం చారిత్రక తీర్పు ఇచ్చింది. విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉప వర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. ఈ క్రమంలో గతంలో ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును కొట్టేసింది.

అసలు కేసు ఏంటంటే..

వాల్మీకీలు, మఝాబీ సిక్కులకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పంజాబ్ ప్రభుత్వం తెచ్చిన నిబంధనను కొట్టివేస్తూ పంజాబ్, హర్యానా హైకోర్టు 2010లో తీర్పు ఇచ్చింది. అయితే ఈ తీర్పునకు వ్యతిరేకంగా సుప్రీంలో పిటిషన్లు దాఖలయ్యాయి. ఎస్సీ కేటగిరీలో వర్గీకరణలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కు విరుద్ధమని 2004లో ’ఈవీ చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్’ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు మేరకు పంజాబ్ సర్కారు నిర్ణయాన్ని హైకోర్టు తప్పుబట్టింది.

అయితే.. హైకోర్టు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 2011లో పంజాబ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. 2020లో సుప్రీంకోర్టు ఐదుగురు జడ్జిల ధర్మాసనం ఈవీ చిన్నయ్య కేసులో సుప్రీం ఇచ్చిన తీర్పును తప్పుబట్టింది. కోఆర్డినేట్‌ ధర్మాసనం ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించవలసిన అవసరం ఉందని.. దీనిపై పున:సమీక్షించాలని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి కేసును బదిలీ చేసింది.

ఫిబ్రవరిలో తీర్పు రిజర్వ్

ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉందా? లేదా? అనే అంశంపై దాఖలైన 23 పిటిషన్లను ఈ ఏడాది ఫిబ్రవరిలో సీజేఐ రాజ్యాంగ ధర్మాసనం మూడు రోజుల పాటు విచారణ సాగింది. వాదనలు ముగియడంతో ఆ టైంలో తీర్పును రిజర్వ్‌ చేస్తున్నట్లు ఫిబ్రవరి 8న ప్రకటించింది. ఇప్పుడు.. ఐదు నెలల తర్వాత ఆ తీర్పు ఏంటో వెల్లడించింది.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button