తెలుగు
te తెలుగు en English
Linkin Bioతెలంగాణ

Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్ట్.. సీఎం రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్ షో?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ వెనుక రాజకీయ కుట్ర కోణం ఉందంటూ వార్తలు వస్తున్నాయి. ఇదంతా కావాలనే, కక్షపూరితంగానే చేసిన అరెస్టు అని బన్సీ ఫ్యాన్స్‌తో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. పుష్ప-2 సక్సెస్ పార్టీలో సీఎం రేవంత్ రెడ్డి పేరును మర్చిపోవడమే అల్లు అర్జున్ చేసిన తప్పు అని.. అందుకే ఆయనను అరెస్ట్ చేశారని, హైకోర్టు బెయిల్ ఇచ్చినా అల్లు అర్జున్‌ను రాత్రంతా జైల్లో ఉంచి ప్రభుత్వం కక్ష సాధించుకుందన్న ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాదు, శుక్రవారం అరెస్ట్ చేస్తే రెండో శనివారం, ఆదివారం కోర్టుకు సెలవులు కాబట్టి బెయిల్ రాకుండా ప్లాన్ చేసి అరెస్ట్ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేశారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ‘హైడ్రా’తో కాంగ్రెస్ ప్రభుత్వానికి హైదరాబాద్‌లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో ఆ వ్యతిరేకతను కొంతైనా పోగొట్టుకునేందుకు నగరంలో ఏం జరిగినా ప్రభుత్వం వెంటనే స్పందిస్తుందని, నగర ప్రజల ప్రాణాలు పోతుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదనే మెసేజ్‌ను ఇచ్చేందుకే సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయించారని చర్చించుకుంటున్నారు.

రాజకీయ కక్షతోనేనా?

సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన నిజంగా బాధాకరం. చనిపోయిన రేవతి కుటుంబానికి ఇటు అల్లు అర్జున్ అయినా, అటు ప్రభుత్వం అయినా, ఎవరైనా సరే.. అందరూ అండగా నిలవాల్సిందే. కానీ ఈ ఘటనకు కేవలం అల్లు అర్జున్‌నే బాధ్యుడిని చేయడం ఎంతవరకు కరెక్ట్? అనే ప్రశ్నలు సామాన్యుల పౌరుల నుంచి సైతం వస్తున్నాయి. పైగా డిసెంబర్ 4న ప్రీమియర్ షో చూసేందుకు సంధ్య థియేటర్‌కు అల్లు అర్జున్ వస్తున్నారని చిక్కడపల్లి పోలీసులకు థియేటర్ యాజమాన్యం ముందే సమాచారం అందించింది. అందుకు సంబంధించిన కాపీ సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది. అంటే అల్లు అర్జున్ వస్తున్నారని, జనాలు భారీగా వస్తారని పోలీసులకు ముందే తెలుసు. కానీ బందోబస్తు కల్పించడంలో ఇటు పోలీసులు గానీ, అటు ప్రభుత్వం గానీ విఫలమైన మాట వాస్తవం. కానీ ఆ వైఫల్యం నుంచి తప్పించుకునేందుకు అల్లు అర్జున్ మీద, థియేటర్ మీద ఆ నిందను వేస్తున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు, థియేటర్ వద్ద తొక్కిసలాట క్రమంలో పోలీసులు సైతం బాధ్యత మరిచి అల్లు అర్జున్‌ను చూడటానికి ఎగబడ్డారని కోర్టులో బన్నీ తరుఫు లాయర్ చెప్పడం చర్చనీయాశంగా మారింది. ఇక అరెస్ట్ తర్వాత బన్నీపై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సినిమా స్టార్లు కేవలం బిజినెస్ మాత్రమే చేస్తారని.. అల్లు అర్జున్ ఏమైనా బోర్డర్‌లో శ్రతువులతో యుద్ధం చేశారా? అన్న సీఎం వ్యాఖ్యలపై విమర్శలు గుప్పుమంటున్నాయి. ప్రభుత్వం ఎంటర్టైన్మెంట్ పేరుతో సినిమా వాళ్ల నుంచి లక్షల రూపాయల పన్ను వసూలు చేస్తూ.. ఇలా మాట్లాడటం పట్ల సినీ ప్రముఖులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

‘హైడ్రా’తో ప్రాణాలు కోల్పోయిన ఘటనల్లో సీఎంను అరెస్ట్ చేస్తారా?

మరోవైపు, అల్లు అర్జున్‌ అరెస్ట్‌తో హైదరాబాద్ ప్రజల్లో సింపతీ కొట్టేయాలని చూసిన రేవంత్ మాస్టర్ ప్లాన్ బెడిసి కొట్టినట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ అరెస్ట్ పట్ల అనూహ్యంగా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా అనేక మంది ఖండిస్తున్నారు. ఒక నేషనల్ అవార్డ్ గ్రహీత పట్ల తెలంగాణ పోలీసులు వ్యవహరించిన తీరును సినీ, రాజకీయ ప్రముఖులందరూ తప్పుపడుతున్నారు. ఇక, టాలీవుడ్ ప్రముఖులంతా అల్లు అర్జున్‌ ఇంటికి చేరుకొని సంఘీభావం తెలుపుతున్నారు. మరోవైపు, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు సైతం అల్లు అర్జున్ అరెస్టును ఖండించాయి. ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అని ఆరోపిస్తున్నాయి. అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన షో అట్టర్ ఫ్లాప్ అయ్యిందని విమర్శించాయి. ఇక, ఈ అరెస్ట్ విషయంలో ప్రభుత్వంపై బన్నీ ఫ్యాన్స్ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోతే అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసినప్పుడు.. ‘హైడ్రా’తో సీఎం రేవంత్ రెడ్డి అనేక మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమయ్యారని.. ఆయనను కూడా అరెస్ట్ చేస్తారా? అని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు, యూపీలోని హత్రాస్‌లో భోలే బాబా సత్సంగ్‌ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో 121 మంది మరణించినా ఆయనను ఎందుకు అరెస్ట్ చేయాలని ప్రశ్నిస్తున్నారు. రాజకీయ నాయకుల ప్రచారాల్లో జరిగిన తొక్కిసలాట ఘటనల్లో ఇప్పటివరకు ఎంతమంది నాయకులను అరెస్ట్ చేశారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button