BRS: కేసీఆర్ కు షాక్… సొంత జిల్లాలోనే పిరాయింపులు
ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఓ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయినట్టు ప్రచారం జరుగుతుంది. ఈ మేరకు కాంగ్రెస్ లీడర్లతో సదరు ఎమ్మెల్సీ సంప్రదింపులు పూర్తిచేసినట్లు తెలుస్తుంది. ఏఐసీసీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే చేరికకు ముహుర్తం ఖరారు అవుతుందని టాక్ ఉంది. అయితే కేసీఆర్ సొంత జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ పార్టీ మారడం హాట్ టాఫిక్‌గా మారింది. ఆ ఎమ్మెల్సీ రాజకీయ కారణాలతోనే పార్టీ మారుతున్నారా? లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే చర్చ జరుగుతుంది.
ఇప్పటివరకు కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గుట్టుచప్పుడు కాకుండా పార్టీ మారారు. తమ చేరిక విషయం బయటికి వస్తే, గులాబీ లీడర్లు ఎక్కడ అడ్డుపడుతారేమోననే కారణంతో చివరి నిమిషం వరకు తమ సన్నిహితులకు సైతం చెప్పకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ, పార్టీ మారేందుకు సిద్ధమైన ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన గులాబీ ఎమ్మెల్సీ ముందుగానే మాజీ సీఎం కేసీఆర్ వద్దకు వెళ్లి, పార్టీ మారుతున్న విషయాన్ని ఆయనకు వివరించినట్టు ప్రచారం జరుగుతుంది.
ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం కోసమే ఆయన్ను బీఆర్ఎస్‌లో చేర్చుకున్నారు. అయితే, ఆ ఎమ్మెల్సీని కాంగ్రెస్‌లో చేర్చుకునే విషయంలో ఏఐసీసీ నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదని, అతన్ని చేర్చుకుంటే ఎదురయ్యే రాజకీయ విమర్శలను ఏ విధంగా ఫేస్ చేయాలనే అంశంపై మల్లగుల్లాలు పడుతున్నట్టు తెలుస్తుంది. అందుకోసం చేరిక లేట్ అవుతుందని కాంగ్రెస్ వర్గాల్లో టాక్ ఉంది.