CM: ఓటుకు నోటు కేసులో రేవంత్ కు షాక్.. విచారణకు రావాలంటూ నాంపల్లి కోర్టు ఆదేశాలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నాంపల్లి కోర్టు షాక్ ఇచ్చింది. ఓటుకు నోటు కేసులో నాంపల్లి కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 16న జరిగే విచారణకు సీఎం రేవంత్ రెడ్డి హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. ఇవాళ జరిగిన విచారణకు మత్తయ్య హాజరవ్వగా..కేసులోని ఇతర నిందితులు గైర్హాజరయ్యారు. ఈడీ కేసు విచారణలో నిందితులు హాజరు కాకపోవడంపై నాంపల్లి ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. తదుపరి విచారణకు తప్పకుండా హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. వచ్చేనెల 16వ తేదీకి విచారణను వాయిదా వేసింది. ఆ రోజు సీఎం రేవంత్ సహా నిందితులు అందరూ కోర్టుకు హాజరు కావాలని స్పష్టం చేసింది.
అప్పట్లో సంచలనం!
2015లో తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటేడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌ను టీడీపీకి మద్ధతుగా వ్యవహరించాలని డబ్బు ఆశ చూపిన ఆరోపణలపై అప్పటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిపై ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. స్టీఫెన్ సన్ ఇంట్లో రేవంత్ రెడ్డి డబ్బు సంచులతో ఉన్నట్లు వీడియోలు అప్పట్లో సంచలనంగా మారాయి. దీంతో కేసు నమోదు చేసిన ఏసీబీ దీనిపై సుధీర్ఘంగా విచారణ జరుపుతోంది. ఇందులో భాగంగానే నాంపల్లి కోర్టు సీఎం రేవంత్ రెడ్డితో పాటు నిందితులుగా ఉన్న సెబాస్టియన్, ఉదయ్ సింహా, మత్తయ్య జెరూసలేం, సండ్ర వెంకట వీరయ్య, వేం కృష్ణ కీర్తన్‌కు సమన్లు జారీ చేసింది.